దేశంలో లోక్సభ మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఈ మూడో దశలో 11 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. దీనిలో భాగంగా ఉదయం 11 గంటల వరకు 25.41 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 32.82 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా మహారాష్ట్రలో 18.18 శాతం నమోదైనట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్, ఇతర నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశంలోని 11 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్లో 26, కర్ణాటకలో 14, మహా రాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్లో 10, మధ్యప్రదేశ్లో 8, ఛత్తీస్గఢ్లో 7, బీహార్లో 5, అస్సాంలో 4, పశ్చిమ బెంగాల్లో 4, గోవాలో 2 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యులో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 120 మంది మహిళలు సహా 1,300 మందికి పైగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. జూన్ 4న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించ నున్నారు.


