తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ చేసిన బీజేపీ అధిష్టానం. ప్రచారాన్ని ముమ్మరం చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా ఏపీ, తెలంగాణలో పర్యటిస్తున్నారు అగ్రనేతలు. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఇవాళ రాజమండ్రి, అనకాపల్లి లో బహిరంగ సభలకు ఆయన హాజరుకానున్నారు.
రాజమండ్రిలో ప్రధాని మోదీ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న వేమగిరిలో జాతీయ రహదారి పక్కన సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం మూడింటి నుంచి 3.45 గంటల వరకు సభ జరగనుంది. తొలుత నిర్ణయించిన సమయం కంటే మోదీ అరగంట ముందే రానున్నారు. ఇక్కడినుంచి ఆయన వెంటనే అనకాపల్లి వెళ్లాల్సి ఉండటం తో సూర్యాస్తమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మార్పు చేశారు. రాజమండ్రి సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొంటారు. ప్రధాని మోదీ ఆకాశమార్గంలో ప్రయాణించే సమయంలో మరో విమానం వెళ్లేందుకు ఆంక్షలు ఉన్నందున చంద్రబాబు రాజమండ్రి సభలో పాల్గొన డానికి సాధ్యం కాలేదు. అనకాపల్లి సభకు చంద్రబాబునాయుడు హాజరవుతారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొనే అవకాశముంది. రాజమండ్రిలో సభా వేదికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితోపాటు ఐదుగురు లోక్‌సభ ఎన్డీయే అభ్యర్థులు, రాజమండ్రి లోక్‌సభ పరిధిలోని ఏడుగురు అసెంబ్లీ అభ్యర్థులతో కలిపి 31 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. సుమారు రెండు లక్షల మంది సభకు హాజరవుతారని సమాచారం. ఎండల దృష్ట్యా ఇందుకు తగిన ఏర్పాట్లు చేశారు కూటమి నేతలు.


