దేశంలో ఎండలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవడంతో వడగాలులు వీస్తున్నాయి. తెలంగాణలోనూ పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది. వడగాలులకు సంబంధించి ఇవాళ, రేపు ఎల్లో అలర్ట్ జారీ చేయగా… శనివారం మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మరో రెండు రోజుల పాటు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం, రాత్రి వేళల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఎండల ప్రభావంతో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఇక, వడదెబ్బ వల్ల మంగళవారం రాష్ట్రంలో ఐదుగురు మరణించారు. అటు ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ 46 మండలాల్లో తీవ్ర వడగాలులు, 143 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు 47 మండలాల్లో తీవ్ర వడగాలులు , 109 మండలాల్లో వడగాలులు వీచే చాన్స్ ఉంది. ఎండల తీవ్రత పెరగడంతో జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
వచ్చే ఐదు రోజులు దేశ మంతటా వడగాలుల ప్రభావం ఉంటుందని భారత వాతావరణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఒడిసా, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో వడగాలులు తీవ్రం కానున్నాయని హెచ్చరించింది. తెలంగాణ, ఏపీ సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే 40-45 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయని పేర్కొంది. రానున్న ఐదు రోజులపాటు వడగా లులు కొనసాగుతాయని, రాత్రి వేళ కూడా వేడి వాతావరణ నెలకొంటుందని హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని.. కర్ణాటక, ఒడిసా, ఉత్తరప్రదేశ్, బిహార్లో నిర్దిష్ట సమయాల్లో వడగాలుల వీస్తాయని పేర్కొంది. రానున్న రెండు రోజుల్లో వాయవ్య భారతంలో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో స్వల్ప మార్పులు చేసుకుంటాయని తెలిపింది. ఆ తర్వాత క్రమంగా 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయని చెప్పింది. ఈశాన్య అసోం, ఈశాన్య బంగ్లాదేశ్లో తుఫాను వాతావరణం నెలకొందని, ఫలితంగా అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, సిక్కిం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.


