వైసీపీ నాయకులను నిలదీసిన నేత
వైసీపీ నాయకులకు ఏ అర్హత ఉందని ప్రజల్లో తిరుగుతున్నారని ఏపీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రవినాయుడు నిలదీశారు. ఓట్లు అడిగే నైతిక హక్కు ఆ పార్టీ నేతలకు లేదన్నారాయన. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్ళలో 8 సార్లు ఛార్జీలు పెంచారని విమర్శించారు. జగన్‌కు మళ్లీ ఓటు వేస్తే కరెంట్ బిల్లులతో ఉరి వేసుకోవాల్సిందే అన్నారు రవినాయుడు.
కూటమి తరపున నల్లమిల్లి ప్రచారం
తూర్పు గోదావరి జిల్లా రామవరంలో నల్లమిల్లిని బీజేపీ నాయకుడు కంటిపూడి సర్వారాయుడు కలుసు కున్నారు. కూటమి తరపున నల్లమిల్లి విజయం కోసం ప్రచారం చేస్తానని చెప్పారాయన. తన గెలుపు కోసం కృషిచేస్తానన్న కంటిపూడి సర్వారాయుడుకి, బిజెపి నేతలకు నల్లమిల్లి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీని స్థాపించినప్పటి నుండీ తన తండ్రి, తాను పార్టీ మాట జవదాటలేదని చెప్పారు.
ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజే ప్రచారం
‘ఆదరించండి అభివృద్ధి చేస్తా’ అని తిరుపతి జిల్లా సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ చెప్పారు. వరదయ్యపాలెం మండలం బత్తలవలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియో జకవర్గం సమస్యలు పరిష్కరిస్తానని, తనకు సాధ్యం కానీ పనులు పైస్థాయికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానన్నారు. తనను, తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని కోరారు.
తల్లిదంద్రుల సమాధుల వద్ద బీజేపీ ఎమ్మెల్యే పూజలు
కంటోన్మెంట్ నియోజకవర్గం బొల్లారంలోని తల్లిదంద్రుల సమాధుల వద్ద బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీ తిలక్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తన తల్లి, మాజీ మంత్రి టీఎన్ సదాలక్ష్మి కంటోన్మెంట్ సెగ్మెంట్ ప్రజలకు ఎంతో సేవ చేశారని చెప్పారు. సేవ చేసేందుకు ప్రజల ముందుకు వచ్చానని వంశీ తిలక్ అన్నారు.
కాంగ్రెస్ పాలనపై నామా విమర్శ
అధికారంలోకి రాగానే 6 హామీలు నెరవేరుస్తామని ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ తప్పిందని ఖమ్మం బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొద లైందన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో రాష్ట్రం తరపున పొరాడుతామని నామా చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు ప్రజలను ఓట్లు అడగడం కాంగ్రెస్‌కు తగదని పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు.
జీవన్ రెడ్డికి ప్రజల ఆదరణ
నిజామాబాద్‌లో ఏడు సెగ్మెంట్లలో ప్రజలు జీవన్ రెడ్డిని ఆశీర్వదించడానికి ముందుకు వస్తున్నారని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు. తాను ఒక్కసారి ధర్మపురి కాంగ్రెస్ తలుపులు తెరిస్తే కొప్పుల ఈశ్వర్ వెనుక ఒక్క కార్యకర్త కూడా మిగలరన్నారు. గ్రామస్థాయి కాంగ్రెస్ కార్యకర్తల నిర్ణయం ప్రకారమే పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్‌కు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన తెలిపారు.
మహేష్‌పై దుండగులు దాడి
రాజేంద్రనగర్ సెగ్మెంట్ కాంగ్రెస్ సేవాదళ్ బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్‌పై దుండగులు దాడి చేశారు. హైదరాబాద్ హబ్సి గూడ నుండి వెళ్తుండగా దుండగులు ఆయన కారు ఆపి దాడికి పాల్పడ్డారు. అత్తాపూర్ డివిజన్ భూపాల్‌నగర్‌లో జరుగుతున్న భూభాగోతాల గురించి ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని మహేష్ చెప్పారు. దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రొఫెషనల్ గేమింగ్ స్థావరంపై పోలీసుల దాడి
కండ్లకోయ టీచర్స్ కాలనీలో నూజివీడు సీడ్స్ సీనియర్ సైంటిస్ట్ రాజేష్ నిర్వహిస్తున్న ప్రొఫెషనల్ గేమింగ్ స్థావరంపై సైబరాబాద్ SOT పోలీసులు దాడిచేసి, 14 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 53 వేల 510 రూపాయలు, 61 వేల 620 రూపాయల విలువైన గాంబ్లింగ్ కాయిన్స్, 13 సెల్‌ఫోన్లు సీజ్ చేశారు. ఒక్కొక్కరి నుండి రాజేష్ అడ్వాన్స్‌గా రోజుకు 20 వేలు తీసుకుని ప్లాస్టిక్ కాయిన్స్ ఇస్తాడని పోలీసులు తెలిపారు. మేడ్చల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
కొండగట్టు అంజన్న ఉత్సవాలు
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో రేపటి నుంచి చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతు న్నాయి. వివిధ జిల్లాల నుంచి కాలి నడకన దీక్ష పరులు రావడంతో కొండగట్టుకు కాషాయ శోభ సంతరించుకుంది.
చల్లబడిన భద్రాచలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఎండ వేడితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. మధ్యహ్నం వరకు సూర్యుడు నిప్పులు చెరిగినా.. సాయం త్రం వర్షంతో వాతావరణం చల్లబడింది.
యువకుల బైక్ ర్యాలీ
చేవెళ్ల బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతుగా వికారాబాద్ జిల్లా తాండూరులో సుమారు 800 పైగా బైకులతో యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. పురవీధుల గుండా కమలం జెండా పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ చేశారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తనయుడు కొండా విశ్వజిత్ ఆధ్వ ర్యంలో ఈ బైక్ ర్యాలీ కొనసాగింది.
కలుసుకున్న శత్రువులు
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఆగర్భ శత్రువులు దేవినేని ఉమ, వసంత కృష్ణప్రసాద్ ఆత్మీయంగా కలుసుకు న్నారు. తన నామినేషన్ కార్యక్రమానికి దేవినేని ఉమను వసంత ఆహ్వానించారు. 2019 ఎన్నికల్లో వీరు ప్రత్యర్థులుగా తలబడ్డారు. తాజా రాజకీయ పరిణామాలతో కృష్ణప్రసాద్ టిడిపిలో చేరటమే కాకుండా మైలవరం కూటమి అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు. చంద్రబాబును సీఎం చేయడమే ధ్యేయంగా కలిసి పనిచేస్తామని కృష్ణప్రసాద్, ఉమ అన్నారు.
ఎమ్మెల్యే పిన్నెల్లిపై జంగా ఆరోపణ
పల్నాడులో నియంతృత్వ పాలన జరుగుతోందని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. మాచర్ల సెగ్మెంట్‌లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలను ప్రోత్స హిస్తున్నారని జంగా ఆరోపించారు. టీడీపీ ప్రచారానికి విశేష స్పందన రావడంతో బత్తుల శ్రీనివాస్ యాదవ్ ట్రాక్టర్, గడ్డివామును వైసీపీ నేతలు దగ్ధం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
శ్రీవారి వసంతోత్సవాలు
తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎండవేడి నుండి స్వామివారు ఉపశమనం పొందేందుకు ఈ ఉపశమనోత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలు రకాల ఫలాలను స్వామివారికి వివేదిస్తారు. ఈ వేడుకల కోసం మండపాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు.


