బ్లూవేల్ ఆటతో ప్రాణాలు కోల్పోయిన యువకుడి సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. బ్లూ వేల్ ఛాలెంజ్ స్వీకరించిన 22 ఏళ్ల ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల్లోకి వెళితే …. 22 ఏళ్ల ఇంజనీర్ పేరు శేషాద్రి. మెట్టుకుప్పంలో ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను సూసైడ్ ఎందుకు చేసుకున్నాడో ఎవరికీ తెలియదు. పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత వాస్తవాలు బయటపడ్డాయి. మృతుడి గదిలో దెయ్యాలకు సంబంధించిన పలు పుస్తకాలు లభ్యమయ్యాయి. మొబైల్ ఫోన్ చెక్ చేస్తే… బ్లూ వేల్ గేమ్ ఆడుతున్నట్టు తేలిసింది. అతని ఆత్మహత్యకు బ్లూ వేల్ గేమ్ కారణమన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బ్లూ వేల్ ఛాలెంజ్ చాలా డేంజరస్ గేమ్. ఒక్కసారి ఆ ఛాలెంజ్ స్వీకరిస్తే టాస్కులన్నీ పూర్తి చేయాలి. ఆట ఆలడే వ్యక్తులను గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో కంట్రోల్ చేస్తుంటారు. ఒక టాస్క్ పూర్తైన తర్వాత మరో టాస్క్ ఇస్తూనే ఉంటారు. చివరకు ఆత్మహత్యకు ప్రేరేపిస్తారు. గతేడాది భారత దేశంతోపాటు ప్రపంచ దేశాల్లో బ్లూవేల్ కలకలం రేపింది. బ్లూ వేల్ గేమ్ అనేకమంది ప్రాణాలు తీసింది. అయితే దేశంలో బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఇప్పటి వరకు లేవని ఈ ఏడాది జనవరిలో లోక్‌సభలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే జనంలో భయం మాత్రం అలాగే ఉంది. తాజాగా మోమో గేమ్ కూడా సరిగ్గా ఇలాంటి కలకలమే రేపింది. పశ్చిమబెంగాల్, ఒడిశాలో మోమో గేమ్ ఆడుతున్నట్టు పరిశోధనలో తేలింది. దీంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు అప్రమత్తమయ్యారు. ఇంతలోనే బ్లూ వేల్ ఛాలెంజ్ ఒకరిని బలితీసుకోవడంతో ప్రజలను ఉలిక్కిప డ్డారు.


