ఖమ్మం జిల్లా రాజకీయాల్లో నాన్‌లోకల్ వ్యవహారం కాకరేపుతోంది. పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచేదెవరన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ. పక్కా లోకల్ అయి ఉండాలి అంటున్నారు స్థానిక నేతలు. ఎప్పుడు బయటవాళ్లేనా.? మేం కంటికి కనిపించమా అంటూ తెగ ఫైర్ అవుతున్నారు అక్కడి లోకల్ లీడర్లు. మా నిర్ణయంకాదంటే పర్యవసానాలు వేరేగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఖమ్మం గుమ్మంలో ఏం జరుగుతోంది. లోకల్, నాన్‌లోకల్ టాక్ ఎందుకు వస్తోంది.?
పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా, నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నా ఇప్పటికీ ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో క్లారిటీ రాలేదు. రాష్ట్రంలో అధికారం వారి చేతుల్లోనే ఉండటంతో హస్తం గెలుపు సునాయాసమే అయినప్పటికీ ఖమ్మం టికెట్‌కు అభ్యర్థి ఎవరన్నది తేల్చడం లేదు హైకమాండ్. స్థానికంగా అన్నివిధాలా బలమైన అభ్యర్థులు కాంగ్రెస్ తరపున బరిలోకి దిగేందుకు సిద్దంగా ఉన్నారు. ఇందుకుగాను ముందుగానే దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే, అధిష్టానం మాత్రం లోకల్ లీడర్లను పక్కన పెట్టి స్థానికేతరులను బరిలో దించాలన్న యోచనలో ఉంది. దీంతో ఖమ్మం జిల్లా ప్రజలతోపాటు అక్కడి స్థానిక కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నారు. నాన్‌లోకల్ వ్యక్తికి టికెట్ ఇస్తే పర్యావసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
ఖమ్మం లోక్‌సభ టికెట్‌ను స్థానిక అభ్యర్థికే ఇవ్వాలని కాంగ్రెస్ ఖమ్మం నేతలు, కార్యకర్తలు గట్టిగా డిమాండ్ చేస్తున్నప్పటికీ హైకమాండ్ మాత్రం. 75 ఏళ్ల వయస్సున్న స్థానిక నాయకులు మండవ వెంకటేశ్వర్‌రావు, లేదా రఘురామిరెడ్డిని బరిలో దించే యోచలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో అధిష్టానం నిర్ణయంపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. ఖమ్మం జిల్లాతో సంబంధంలేని ఈ ఇద్దరు నేతలు రాజకీయాలలో కూడా ప్రస్తుతం చురుకుగా లేరని, పైగా ఖమ్మం టికెట్ కోసం వీరు దరఖాస్తు కూడా చేయలేదని గుర్తు చేస్తున్నారు. రాజకీయంగా చైతన్యం కలిగి, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బలంగా వెన్నుదన్నుగా నిలబడుతున్న నేతలకే టికెట్ ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు లోకల్ లీడర్లు.
గతంలోనూ లక్ష్మీకాంతమ్మ, నాదెళ్ల భాస్కరరావు, రేణుకాచౌదరి, పివి రంగయ్యనాయుడు వంటి స్థానికేతర నాయకులను బలవంతంగా తీసుకువచ్చి తమపై రుద్దినప్పటికీ, వారి గెలుపుకోసం సహకరిం చామని,ఈసారి అందుకు ఒప్పుకోమని తెగేసి చెబుతున్నారు. తమ డిమాండ్‌ను కాదని హైకమాండ్ స్థానికేతర అభ్యర్థికే టికెట్ కేటాయిస్తే పర్యావసనాలు వేరేగా ఉంటాయని.. అందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చిరిస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య హైకమాండ్ ఎలాంటి నిర్ణయం ఎలా ఉండనుంది..? స్థానిక నేతలకు అవకాశమిస్తుందా..? నాన్‌లోకల్‌ను బరిలో దించుతుందా.. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.


