ఈడీ ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్పై స్పెషల్ కోర్టులో విచారణ జరుగనుంది. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలులేవని పిటిషన్లో పేర్కొన్నారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని చెప్పుకొచ్చారు. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని తనను లిక్కర్ కేసులో ఇరికించారని కవిత చెప్పారు. తన పాత్రకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని పేర్కొన్నారు.
మరోవైపు.. కవిత వాదనలను ఈడీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. కవిత లిక్కర్ కేసులో కింగ్ పిన్ అని, ఆప్-సౌత్ గ్రూపునకు మధ్య కవిత దళారీగా వ్యవహరించారని ఈడీ అంటోంది. లిక్కర్ స్కాంలో భాగంగా 100కోట్ల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్ర అని చెబుతోంది. ఇండో స్పిరిట్ ద్వారా తిరిగి ముడుపులు కవిత వసూలు చేశారని అంటోంది. కిక్ బ్యాగ్స్ చేరవేతలో కవిత కీలకంగా ఉన్నారని, సాక్ష్యాలు దొరకకుండా కవిత తన ఫోన్లో డేటాను డిలీజ్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈడీ అధికారులు.అలాగే, ఈడీ నోటీసులు ఇచ్చాక వాట్సాప్ డేటాను డిలీట్ చేశార న్నారు ఈడీ అధికారులు. డిజిటల్ ఆధారాలు లేకుండా ముందు జాగ్రత్తపడ్డారని చెప్పారు. కవితా చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమెకు నోటీసు ఇచ్చిన వెంటనే అరుణ్ పిళ్లై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అరుణ్ పిళ్లైని బెదిరించి వాంగ్మూలం ఉపసంహరించుకునేలా చేశారని చెప్పారు. ఆమెకు బెయిల్ ఇస్తే, సాక్షులకు ప్రభావితం చేయగలరని సాక్ష్యాలను ధ్వంసం చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ తన కౌంటర్ పిటిసన్ లో కోర్టును కోరారు.
ఇదిలా ఉంటే కవితకు మరోసారి చుక్కెదురైంది. లిక్కర్ స్కాం కేసులో కవితకు ఈనెల 23వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీని విధించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. దీంతో సీబీఐ అధికారులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు. మూడు రోజుల కస్టడీ ముగియడంతో నిన్న కవితను సీబీఐ అధికారులు ప్రత్యేక కోర్టులో సీబీఐ న్యాయమూర్తి కావేరి బవేజా ముందు ప్రవేశ పెట్టారు. ఆ సమయంలో సీబీఐ తన వాదనలు వినిపిస్తూ.. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారిం చామన్నారు. ఆమె విచారణకు సహకరిం చలేదని చెప్పింది. ఈ క్రమంలో కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని కోరింది. అందుకోసం మరో 14 రోజులు కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరగా.. కోర్టు మాత్రం 9 రోజుల కస్టడీకి అనుమ తించింది. ఈ నేపథ్యంలో ఈనెల 23వ తేదీ వరకు కవితకు కోర్టు కస్టడీని పొడిగించింది. ఇదే సమయం లో కవితపై ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడటంపై సీరియస్ అయ్యారు. జర్నలిస్టులు ప్రశ్నలు అడిగినా ఎలా మాట్లాడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి ఇలా మాట్లాడవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. అనంతరం, కవిత బయటకు వస్తూ సీబీఐపై ఆరోపణలు చేశారు. ఇది సీబీఐ కస్టడీ కాదు. బీజేపీ కస్టడీ అని అన్నారు. రెండు నెలల నుంచి అడిగిందే అడుగుతున్నారని, బయట బీజేపీ అడిగిందే, లోపల సీబీఐ అడుగుతోందని చెప్పారు. ఇందులో కొత్తది ఏమీ లేదని తీవ్ర ఆరోపణలు చేశారు.


