తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు హీటెక్కిస్తున్నాయ. ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ ఎవరెవరు ఎవరితో కలిసి ముందుకెళ్తున్నారో తెలియని పరిస్థితి. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖార్ వ్యాఖ్యలు ఆసక్తి రెకేత్తిస్తున్నాయి. ఫిరోజ్‌ఖాన్ మాటల వెనుక మర్మం ఏంటి…? అసలు దీని వెనుక కాంగ్రెస్ వ్యూహం ఏంటి..? దీనిపై ప్రతిపక్ష నేతలు ఏమంటున్నారు…?
కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారాయి. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై సంచలన వాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడం పట్ల ఆయన స్పందించారు. అసదుద్దీన్, కాంగ్రెస్‌కి మధ్య దోస్తీ ఫిక్స్ అయిందని కుండబద్దలు కొట్టారు. హైదరాబాద్‌లో అసదుద్దీన్ గెలవాలని కాంగ్రెస్ హైకమాండ్, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఏది ఏమైనా తనకు, అసదుద్దీన్‌కు మధ్య ఫైట్ కంటిన్యూ అవుతుందన్నారు. కాకపోతే ఎంపీ ఎలెక్షన్లలో తన పార్టీ సూచించిన విధంగా పనిచేస్తానని ఫిరోజ్‌ఖాన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఎవరు ఎవరితో దోస్తీ చేస్తున్నారో తెలియని అయోమయం అందరిలోనూ నెలకొంది.
ఇదిలా ఉంటే హైదరాబాద్ సీటుకు సంబంధించి ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేశాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు తమ అభ్యర్ధిని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ నాలుగు పార్టీ అభ్యర్థులు తలపడితే..తన గెలుపు కష్టమేనని అసదుద్దీన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా హిందువును బరిలోకి దింపాలని కాంగ్రెస్‌పై అసదుద్దీన్ ఒత్తిడి తెస్తున్నట్లుగా జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ కాంగ్రెస్ నుంచి ముస్లింకు టికెట్ ఇస్తే ఓట్లు భారీగా చీలే అవకాశం ఉందని ఎంఐఎం చీఫ్ డైలమాలో పడ్డారు. ఇటీవలే ఆయన హస్తం పార్టీలోని ముస్లిం నాయకుడితో భేటీ అయి రేవంత్‌తో రాయబారం నడిపినట్లుగా టాక్ వినిపిస్తోంది. తాజా పొలిటికల్ స్ట్రాటజీలతో రాష్ట్రంలో కాంగ్రెస్, ఎంఐఎంకు మధ్య సయోధ్య కుదిరిందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
ఇంతకాలం ఉప్పు, నిప్పులా ఉన్న కాంగ్రెస్, ఎంఐఎంలు ఒక్కటేనని తానెప్పుడో చెప్పానన్నారు..బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్. ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలతో ఇప్పుడా ఆ బంధం బయటపడిందని విమర్శించారు. కాంగ్రెస్‌కు ముస్లింల పట్ల ప్రేమ ఉందన్నది నాటకమన్నారు. నిజంగా కాంగ్రెస్‌కు ముస్లింల పట్ల ప్రేమ ఉంటే హైదరాబాద్ బరిలో ఫిరోజ్‌ఖాన్‌ను పోటీలో దించాలన్నారు. ఆ స్థానంలో ఎందుకు డమ్మీ అభ్యర్థులను నిలబెడుతున్నారని..ఫిరోజ్‌ఖాన్‌కు ఎందుకు టిక్కెట్ ఇవ్వడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ పతనానికి ఇలాంటి కుటిల రాజకీయాలే కారణమని అర్వింద్ దుయ్యబ ట్టారు.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలంగాణ స్టేట్ పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారుతున్నా యి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఆయా పార్టీలు ప్రచారపర్వాన్ని కూడా ప్రారంభించాయి. ఈ క్రమం లో అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల లోపు ఎవరు ఎవరితో దోస్తీ కడతారో తెలియని పరిస్థితి నెలకొంది.


