ఫోన్ ట్యాపింగ్ ఈ పేరు వింటేనే ఒళ్ళు జలదరిస్తోంది. మన ఫోన్ నుంచి మనం వేరొక వ్యక్తితో మాట్లాడిన మాటలు బహిర్గతమైతే, అమ్మో వినడానికే భయమేస్తోంది. రాష్ట్రంలో నిన్న, మొన్నటి వరకు అధికారం లో ఉన్న సమయంలో జరిగిన ఈ వ్యవహారం…ఇప్పడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేకెత్తి స్తోంది. ఈ ట్యాపింగ్ చర్య ఖమ్మం జిల్లా పైనా పడగ విప్పింది. అవును ఇది నిజం. బీఆర్‌ఎస్ జిల్లా నేతలను తమ అదుపాజ్ఞలో ఉంచుకునేందుకు నాటి ప్రజాప్రతినిధులు సైతం ఈ అస్త్రాన్ని వినియోగిం చారంటే ఆశ్చర్యం కలుగక మానదు.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గుబులు రేపుతున్న అంశం ఫోన్ ట్యాపింగ్. అధికార, ప్రతిపక్షాల నడుమ భగ్గుమంటున్న సమస్య ఇది. అయితే తాజాగా దీని మూలాలు ఖమ్మం జిల్లాలోనూ బయట పడుతున్నాయి. జిల్లాకు చెందిన నాటి నేత, ఒక మాజీ పోలీస్ బాస్‌ని అడ్డం పెట్టుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ బాగోతానికి తెర లేపినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఒక వార్ రూమ్‌ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి తమకు కావాల్సిన ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసేందుకు పథకం రచన చేశారని ప్రచారం జరుగుతోంది. సదురు మాజీ పోలీస్ అధికారి ఆ అధికారి సాంకేతిక అండదండలతో ఇష్టారీతిన ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడినట్లు తెలుస్తోంది.
జిల్లాలోని కీలక నేతలుగా వ్యవహరిస్తూ అమాత్యునికి కొరగాని కొయ్యలా మారిన ప్రత్యర్థుల ఫోన్లతో పాటు…సొంత పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు లీకవుతున్నాయి. ఈ నేతల ప్రతి కదలికను ఒడిసి పట్టేందుకు ఈ అస్త్రాన్ని ఆయన భేషుగ్గా ఉపయోగించుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఎన్నికలకు ముందు ప్లేటు ఫిరాయిస్తారన్న అనుమానం ఉన్న నాయకుల పైనా కూడా ట్యాపింగ్ వల విసిరి వారిని బెదిరించి మరీ పార్టీ వీడకుండా అడ్డు తగిలినట్లు ప్రచారం జరుగుతుంది. మాజీ పోలీసు అధికారితో పాటు ఒకరిద్దరు ఏసీపీలు, సీఐలు ఉన్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చ జరుగుతోంది.
ఫోన్ ట్యాపింగ్‌లో మాజీ పోలీసు అధికారిని విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అనేక మంది బీజేపీ నాయకుల ఫోన్లు టాప్ చేసి వారిని మానసికంగా వేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అనేక మంది రియల్టర్లు, వ్యాపారుల ఫోన్లు టాప్ చేశారనే ఆరోపణలున్నాయి. ఒకవేళ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ఫోన్ టాపింగ్‌లను అడ్డుపెట్టుకుని అగ్ర నేతలందరినీ మానసికంగా, శారీరకంగా వేధించాలనే కుట్ర కోణం దాగి ఉన్నట్లు సమాచారం. మాజీ పోలీస్ అధికారిని విచారిస్తే మరిన్ని వివరాలు బట్ట బయలవుతాయని కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కోణం బయట పడుతోంది. ఈ వ్యవహారంలో పోలీసులు లోతైన విచారణ చేస్తున్నా కొద్దీ నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో…ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇంకా ఎలాంటి విషయాలు బయటపెడుతారో చూడాలి.


