ఎండలు.. .ఎన్నికల కన్నా.. ముందు.. ఏపీలో పింఛన్ కష్టాలు వచ్చిపడ్డాయ్. ఎన్నికల కోడ్ కారణంగా ఈసీ ఆదేశాల మేరకు … ఏపీ ప్రభుత్వం వాలంటీర్లను పింఛన్ పంపిణీ విధులనుంచి దూరం పెట్టింది. ఇదే సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో జాప్యం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మంది పించన్‌దారులు మండుటెండల్లో రోడ్డునపడ్డారు. భగ భగ మండే ఎండల్లో పెన్షన్ కోసం గగ్గోలు పెట్టారు. చాలా మంది వృద్ధులు మంచాల మీద, వీల్ చైర్ లలోనూ గ్రామ సచివాలయాలకు వచ్చారు. అంతేకాదు పెన్షన్ కోసం వచ్చి ఎండ తీవ్రతకు ఇద్దరు వృద్ధులు మరణించడం కలిచివేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయింది.
ఒక పక్క పెన్షన్ దారులు కష్టపడుతుంటే… ఈ అంశంపై టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలాయి. నాయకులు పరస్పరం దుమ్మెత్తి పోసుకున్నారు. జగన్ ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల 56 లక్షల మంది పించన్ దారులు రోడ్డునపడ్డారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. పించన్ దారులకు పెన్షన్లు త్వరగా ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు కోరినప్పటికీ.. సీఎం జగన్ కనుసన్నల్లో ఉన్నతాధికారులు అందరూ కలిసి 56 లక్షల మందిని మండుటెండల్లో అవస్థలు పడేలా చేశారన్నారు. ఇక ఏపీలో పెన్షన్ల కష్టాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ల వద్దే పెన్షన్లు అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటని ఏపీ చీఫ్ సెక్రటరీని ప్రశ్నించారు. తన సినిమాలు రిలీజ్ అయితే థియేటర్ల వద్ద రెవెన్యూ ఉద్యోగులకు డ్యూటీలు వేస్తారని..మరి అదే ఉద్యోగులను పెన్షన్లు ఇవ్వడానికి వినియోగించుకోలేరా? అని ప్రశ్నించారు. పెన్షన్లు ఇవ్వడానికి ఉద్యోగులే లేరా? అని నిలదీశారు.
మరోవైపు పెన్షన్లను అడ్డుకున్నది చంద్రబాబే అని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. పెన్షన్లు పంపిణీ జరగకుండా చంద్రబాబు, ఆయన మద్దతుదారులు అడ్డుకున్నారని ఆరోపించారు. పెన్షన్ లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత వచ్చాకా ఇప్పుడు ప్రేమ వలకపోస్తున్నారని తెలిపారు. ఎన్నికల వేళ మండే ఎండల్లో వృద్దులు రోడ్లపై వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని..ఇందుకు కారణం చంద్రబాబే అని అరోపించారు.


