అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో ఏపీలో పొలిటికల్ హీట్ అంతకంతకు పెరుగుతోంది. అధికార, ప్రతిపక్షాల ప్రచార హోరు రణరంగాన్ని తలపిస్తోంది. ఇక తొలిసారి సీఎం జగన్ వివేకానందరెడ్డి హత్యపై సంచలన వ్యాఖ్యలు చేయడం ఎలక్షన్ హీట్‌ని మరింత పెంచింది. కడప జిల్లా వేదికగా జరిగిన జగన్ బస్సు యాత్ర మొదటి రోజే వివేకా మర్డర్ అంశాన్ని తెరపైకి తేవడం వెనుక జగన్ రాజకీయ వ్యూహం ఉందన్న టాక్ వినిపిస్తోంది.
ఏపీలో మాజీ మంత్రి వివేకానంద హత్య కేసు గతంలో రాజకీయ దుమారం రేపగా.. మరోసారి ఎన్నికల వేళ అస్త్రంగా మార్చుకునే వ్యూహంలో ఉన్నాయి పొలిటికల్ పార్టీలు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల వేళ వైయస్ వివేకానంద రెడ్డి హత్య వివాదం తెరపైకి వచ్చింది. వివేక హత్య విషయంలో వస్తున్న విమర్శలపై సీఎం జగన్‌మోహన్ రెడ్డి స్పందించారు. వివేకాను ఎవరు చంపారో అందరికీ తెలుసు అంటూనే సోదరి షర్మిల, వివేకా కుమార్తె సునీతపై కూడా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. మొదట్లో ఆయనది గుండెపోటు మరణం అని చెప్పినా,.. చివరకు వివేకా నంద రెడ్డి హత్య చేయబడ్డారని బయటపడింది. దీంతో ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డి హత్యను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఎన్నికల ప్రచారానికి వాడుకుంది. వివేక హత్య వెనక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ఉన్నారంటూ ఎన్నికల ప్రచారంలో పదేపదే విమర్శించారు జగన్. ఆ ఎన్నికల తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం కావడంతో వివేకా హత్య హంతకులు ఎవరన్నది బయట పడుతుందని అంతా భావించారు. అయితే ఏపీ ప్రభుత్వం వివేకా హంతకులు ఎవరో తేల్చే విషయాన్ని పక్కన పెట్టేసింది. దీంతో ఆయన కుమార్తె సునీతా కేసును సీబీఐకి అప్పగించేలా న్యాయ పోరాటం చేశారు. ఆమె డిమాండ్ ప్రకారమే వివేకా కేసు సీబీఐ చేతిలోకి వెళ్లింది. దర్యాప్తు లో స్పీడ్ పెంచిన సీబీఐ అధికారులు కడప ఎంపీ అవినాష్, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి ప్రమేయం ఉందని అనుమానించింది.
ఇకపోతే వివేకా హత్య కేసు వ్యవహారంలో సీఎం జగన్ సోదరి షర్మిలతోపాటు వివేకా కుమార్తె సునీత సైతం ఏపీ సర్కార్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. హత్య చేసిన నిందితులను ప్రభుత్వం కాపాడుతోందని సునీతరెడ్డి ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయవద్దంటూ బహిరంగంగా సునీత రెడ్డి పిలుపునిచ్చారు. అంతేకాదు..వైసీపీ పునాదులు వివేక రక్తంతో తడిచిపోయాయంటూ ఆమె తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మరోవైపు ఏపీసీసీ అధ్యక్షు రాలుగా షర్మిల కూడా వివేక హత్య కేసులో ఏపీ ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. సునీత చేస్తున్న పోరాటానికి తాను మద్దతు ఇస్తానంటూ ఆమె స్వయంగా ప్రకటించారు. దీంతో వివేక హత్య కేసు అన్న వర్సెస్ చెల్లెళ్లూ అన్నట్టుగా పొలిటికల్ వార్ కొనసాగుతోంది. ఇక ప్రతిపక్షాలు సైతం ఈ విషయంలో జగన్ సర్కార్‌పై దుమ్మెత్తిపోస్తు న్నాయి. వివేకా హత్య వెనుక జగన్ కుటుంబ సభ్యులే ఉన్నారంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసును షర్మిలతోపాటు ప్రతిపక్ష పార్టీలు ప్రధాన అజెండాగా.. తమ అస్త్రంగా మార్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
ఓవైపు సొంత చెల్లెళ్లే సోదరుడు జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు ఏపీ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతున్నాయి. ఈ పరిణామాల మధ్య తొలిసారి సీఎం జగన్ కడప జిల్లా ప్రొద్దుటూరు బహిరంగ సభా వేదికగా తనపై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. వివేక హత్య ఎవరు చేశారో ఆయనకు , కడప జిల్లా ప్రజలకు తెలుసన్నారు జగన్. వివేకానందరెడ్డిని చంపిన వారు ప్రజల్లో బహిరంగంగా తిరుగు తున్నారని.. వారికి ఎవరు మద్దతు ఇస్తున్నారో కూడా తెలుసంటూ పరోక్షంగా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం తనవాళ్లు ఒకళ్ళిద్దరూ తనపై విమర్శలు చేస్తున్నారంటూ షర్మిల, సునీతరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఎన్నికలకు ముందు సీఎం జగన్ కడప జిల్లా వేదికగా వివేకా హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ ప్రయోజనం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ కేసులో ప్రభుత్వం అనుసరించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. మరోవైపు తన చెల్లెళ్లయిన షర్మిల, సునీత రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఈ హత్య వెనుక ప్రతిపక్షాలు ఉన్నాయనే వాదనను మరోసారి ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే జగన్ ఈ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. మరి జగన్ ఆరోపిస్తున్నట్టు వివేకా హత్య కేసులో ప్రతిపక్షాలే ఉన్నాయా…? లేదంటే రాజకీయ ప్రయోజనం కోసం సొంత వాళ్లే మట్టుబెట్టారా..? అసలు వివేకా హత్య వెనుక ఉన్నదెవరు..? అందుకు కారణాలేంటన్నది తెలియా లంటే దర్యాప్తు సంస్థల ఎంక్వైరీ వరకూ వేచి చూడక తప్పదు.


