తెలంగాణ కాంగ్రెస్‌లో ముగ్గురు సీనియర్ నేతల తీరు చర్చనీయాంశంగా మారింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సదరు నేతల అంశం పార్టీలో చర్చలకు దారితీస్తోంది. ముగ్గురు నేతలు కూడా తమకు లోక్‌సభ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నారు. అధిష్టానం వద్ద ముగ్గురు నేతలు ఒత్తిడి చేస్తుండటంతో పార్టీ అధిష్టాన వర్గం కూడా అయోమయంలో పడుతోంది. ఈ ముగ్గురు నేతలు కీలకమైన వారు కావడంతో..వీరిని ఏం చేయాలనే దానిపై సతమతమవుతోంది. ఇంతకీ టీ.కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఆ ముగ్గురు ఎవరు..?
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు ముగ్గురు నేతలపైనే చర్చ జరుగుతోంది. ఎవరా ముగ్గురు అంటే.. మల్లు రవి, వీహెచ్ , అద్దంకి దయాకర్ అని టక్కున చెప్పవచ్చు. ఈ ముగ్గురు కూడా పార్టీకి ఎనలేని సేవ చేశారు. పార్టీ గొంతును ప్రజల మధ్య బలంగా వినిపించగలిగారు. పార్టీ బాగు కోసం తీవ్రంగా కష్టపడిన నేతలు కావడంతో వీరి అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఈ ముగ్గురు నేతలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నారు. కానీ, ఈ ముగ్గురు కోరుతున్న స్థానాల విషయంలో రకరకాల సమీకరణాలు అడ్డంపడుతున్నాయట.
పార్టీలో సీనియర్ నేత వీహెచ్ ఖమ్మం లోక్‌సభ సీటు కావాలని గట్టి పట్టుబడుతున్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో తాను విస్తృతంగా తిరిగానని..తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కానీ, ఆ సీటు కోసం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు తీవ్రంగా పట్టుబడుతున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన భార్య నందిని కోసం, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరూ పార్టీలో కీలక నేతలు కావడంతో ఖమ్మం పార్లమెంట్ సీటు విషయంలో వీహెచ్ రేసులో వెనకబడిపోతున్నారు. కానీ, వీహెచ్ మాత్రం తన ప్రయత్నాలు ఏమాత్రం ఆపడం లేదు. ఖమ్మంలో బీసీలకు అవకాశం కల్పించాలని..తాను చాలా కాలంగా పని చేస్తున్నానని.. అవకాశం ఇవ్వకపోతే నిరాహారదీక్ష చేస్తానంటూ అధిష్టానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు.
ఇక మరో సీనియర్ నేత మల్లు రవి పరిస్థితి కాస్త విచిత్రంగా ఉంది. తెలంగాణలో మూడు ఎస్సీ రిజర్వుడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ మూడింటిని సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని కేటాయించాలని పార్టీ భావిస్తోంది. తెలంగాణలో ఎస్సీ జనాభాలో మాదిగ సామాజికవర్గం ఎక్కువగా ఉన్నందున రెండు సీట్లు మాదిగ సామాజిక వర్గానికి, ఒక స్థానం మాల సామాజిక వర్గానికి ఇవ్వాలన్న ఆలోచనలో అధిష్టానం. అయితే ఇప్పటికే పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు వంశీకి ఇవ్వాలని చూస్తున్నారట. దీంతో ఆటోమెటిక్‌గా మిగతా రెండు ఎస్సీ నియోజక వర్గాలు వరంగల్, నాగర్ కర్నూల్ మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తోంది. మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు రవికి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. కానీ మల్లు రవి మాత్రం గతంలో తాను రెండు సార్లు గెలుపొందానని..ఇప్పుడు కొత్తగా సమస్యలు ఎందుకు క్రియేట్ చేస్తున్నా రంటూ మండిపడుతు న్నారు. అంతేకాదు తనకు ఇటీవల కేటాయించిన ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతి నిధి పోస్ట్‌కు సైతం రాజీనామా చేసి..సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవికి అవకాశం కల్పిస్తే.. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. దీంతో మల్లు రవి అంశం పార్టీలో క్రిటికల్‌గా మారుతోంది.
సీనియర్ నేత అద్దం దయాకర్ విషయంలో అధిష్టానం మొదటి నుంచీ దాగుడుమూతల వ్యవ హారంలా మారు తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి సీటు, ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ వ్యవహారం ఇలా ప్రతీ అంశం అద్దంకి పేరు తెరపైకి రావడం చేజారడం పరిపాటిగా మారింది. అద్దంకికి లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి అవకాశం కల్పిస్తారని మొదట్లో చర్చ జరిగింది. కానీ, అద్దంకి కూడా మాల సామాజిక వర్గం కావడంతో అవకాశం దెబ్బతింటోంది. ఉన్న మూడు స్థానాల్లో రెండు మాదిగలకు ఇవ్వాల్సి ఉన్నందున.. ఒక్క సీటు కోసం ముగ్గురు కీలకమైన మాల నేతలు పోటీ పడుతున్నారు. దీంతో అద్దంకికి లోక్‌సభ సీటు విషయంలో కూడా అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ ముగ్గురు నేతల వ్యవహారం ఉత్కంఠగా మారింది. ఈ ముగ్గురూ పార్టీలో అత్యంత కీలక నేతలు కావడంతో అధిష్టానం ఎలాంటి పరిష్కారం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.