సోషల్ మీడియా ట్రోల్స్ కారణంగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకుందని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఆత్మహత్యాయత్నం చేసిన గీతాంజలిని వెంటనే జీజీహెచ్‌కు తరలించినట్టు చెప్పారు. రైల్వే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు తెలిపారు. రైల్వే పోలీసుల దర్యాప్తులో సోషల్ మీడియా పోస్టింగ్స్ ద్వారా మనస్థాపానికి గురైందని తేలిందన్నారు. రైల్వే పోలీసులు కేసును తెనాలి వన్‌టౌన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశామని ఎస్పీ తుషార్ డూడీ చెప్పారు. అక్కడ ఎఫ్ఐఆర్ ఆల్టర్ చేశామన్నారు. 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. డిజిటల్ ఫుట్ ప్రింట్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ చెక్ చేస్తున్నామని, కొన్ని ఫేక్ ఐడిలు, కొన్ని ఒరిజినల్ ఐడీలు ఉన్నట్లు గుర్తించామన్నారు. అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వారిని గుర్తిస్తామని, ఈ కేసులో ఎవరిని వదిలి పెట్టేది లేదని ఎస్పీ తుషార్ డూడీ అన్నారు.
గీతాంజలి ఈనెల 7న జన్మభూమి ఎక్స్ ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకుంది. తలకు తీవ్ర గాయమవడంతో గీతాంజలి మృతి చెందింది. ఇటీవలె ఇళ్ల పట్టా తీసుకున్న గీతాంజలి.. ఓ చానెల్‌తో ఉత్సాహంగా మాట్లాడింది. తనకు ఇళ్ల పట్టా రావడం ఆనందంగా ఉందని చెప్పింది. ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే గీతాంజలి మాటలను కొందరు సోషల్ మీడియాలో నెగెటివ్‌గా ట్రోల్ చేశారనే ప్రచారం జరిగింది. సోషల్ మీడియా ట్రోల్స్ కారణంగానే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొందరు నిందితులను గుర్తించినట్టు చెబుతున్నారు.