ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కేడర్ అయోమయంలో ఉందా ? ప్రధానంగా నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, కామారెడ్డిలో పైచేయి సాధించేందుకు నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో.. సొంత పార్టీలోనే అంతా గందరగోళ పరిస్థితులు ఉండడంతో పార్టీ శ్రేణులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాడర్ పరిస్థితి గందరగోళంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిన సీనియర్ నేత షబ్బీర్ అలీకి క్యాబినెట్ ర్యాంక్ దక్కింది. అదే నియోజకవర్గానికి చెందిన టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ పైనే ఫోకస్ పెట్టారు. దీంతో క్యాడర్ అయోమయానికి గురవుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓ విధంగా, తర్వాత మరో విధంగా అన్నట్లుగా మారింది కాంగ్రెస్ పరిస్థితి. నిజామా బాద్ అర్బన్, ఆర్మూర్ నియోజకవర్గాలకు అభ్యర్థులు లేక తీవ్రంగా సంక్షోభంలో కొట్టుమిట్టాడిన కాంగ్రెస్ పార్టీకి.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సరికొత్త ఇబ్బంది వెంటాడుతోంది. కాంగ్రెస్ అధికారం చేపట్టాక పదవుల పంపకాల కోసం, కీలకమైన స్థానాల్లో చోటు కోసం నాయకులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు అధిష్టానం దృష్టిలో పడేందుకు తహతహలాడు తుండగా.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంపై పెత్తనం కోసం కూడా పరుగులు తీస్తున్నారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో అర్బన్ నుంచి అనూహ్యంగా షబ్బీర్ అలీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల సమయంలో కేటాయించినంత సమయాన్ని ఇప్పుడు శ్రేణులకు ఇవ్వలేకపోవడంతో హస్తం శ్రేణులు కొంత ఇబ్బందిపడుతున్నారు.
కామారెడ్డిలోనూ పెద్దన్న పాత్ర ఎవరిదన్న దానిపైనా చర్చ జరుగుతోంది. కామారెడ్డి నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పీసీసీ చీఫ్ హోదాలో పోటీ చేసిన రేవంత్ రెడ్డి ఓటమి చెందారు. రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో భాగంగా సమయం లేకపోవడంతో ఇక్కడి బాధ్యతలను రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి చూసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి సీటు కాస్త బీజేపీకి చిక్కడంతో పరిస్థితులు తారుమారు అయ్యాయి. షబ్బీర్ కు కంచుకోట అనుకున్న కామారెడ్డి నియోజకవర్గం కాకుండా పోయింది. నిజామాబాద్ అర్బన్ వలస వెళ్లి పోటీచేసి ఆయన ఓటమి చెందారు. దీంతో కామారెడ్డిపై పట్టు సాధించేందుకు షబ్బీర్ ఆలీకి అవకాశం లేకుండా పోయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సలహాదారుగా ప్రభుత్వం నియమించినప్పటికీ క్యాబినెట్ ర్యాంకులో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ కామారెడ్డి నియోజకవర్గంపై షబ్బీర్ ఆలీకి భవిష్యత్తులో అవకాశం ఉంటుందా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది. పైగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంపైనా షబ్బీర్ చూపు కొనసాగుతుండడంతో ఎటూ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మొన్నటి వరకు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో షబ్బీర్ అలీ పెద్దన్న పాత్ర పోషించారు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో కొండల్ రెడ్డి పట్టు సాధిస్తున్నారు. షబ్బీర్ అలీ ఇటు అర్బన్ ను చూసుకోవాలా లేక సొంత నియోజకవర్గం కామారెడ్డికి పరిమితం కావాలా అన్నది ప్రశ్నగా మారింది.


