జై తెలంగాణ అని నినాదం చేస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అని పోలీసులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. పరకాల ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను ఆయన పరామ ర్శించారు. ఛలో మేడిగడ్డకు వెళుతున్న సందర్భంగా మార్గమధ్యలో కార్యకర్తలను కేటీఆర్ కలిశారు. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న బీఆర్ఎస్ కార్యకర్తలను ఓదార్చారు. గులాబీ సైనికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీయిచ్చారు. ఏమాత్రం అధైర్యపడొద్దని భరోసానిచ్చారు. పరకాల ఘటన నేపథ్యంలో పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝాతో ఫోన్ లో మాట్లాడారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, అటు వంటి వారిపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. న్యాయస్థానాలు, మానవహక్కుల సంఘాలను ఆశ్రయి స్తామని వెల్లడించారు. సమ్మక్క-సారలమ్మ దేవతలను దర్శించుకునేందుకు వెళ్లిన తమ పార్టీ కార్యకర్త లపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని.. థర్డ్ డిగ్రీ ఉపయోంచి విచక్షణారహితంగా కొడుతూ చిత్రహింసలు పెట్టారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మేడారం జాతరలో జై తెలంగాణ నినాదాలు చేయడం తప్పా అని ప్రశ్నించారు.