29.6 C
Hyderabad
Saturday, July 12, 2025
spot_img

రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సెలబ్రిటీస్

       మడిసన్నాక పొద్దస్తమానూ కలాపోసనేనా? అప్పుడప్పుడూ పెజాసేవ కూడా చేయద్దూ? అంటున్నారు కాస్త భిన్నంగా ఆలోచించే జీనియస్ లు. సినిమాల్లోనూ, క్రీడల్లోనూ బాగా రాణించేసి కావల్సినంత డబ్బు సంపాదించిన తర్వాత తమని ఏళ్ల తరబడి ఆదరించిన ప్రజలకు ఏదో ఒకటి చేసి రుణం తీర్చుకోకపోతే ఎలాగ? అంటున్నారు వారు. ఈ ఆలోచనతోనే గతంలో చాలా మంది సినీ స్టార్లు రాజకీయాల్లో అడుగు పెట్టి చక్కగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. కొందరు మంత్రులు కూడా అయ్యారు. సినిమావాళ్లే కాదు క్రీడారంగ నిపుణులూ తమ అదృష్టాన్ని చెక్ చేసుకుని మురిసిపోయారు. కాంగ్రెస్, బిజెపిలతోపాటు వివిధ ప్రాంతీయ పార్టీలూ ఇటువంటి కళాకార్స్ ను చేరదీసి ప్రోత్సహించాయి.

      తెలంగాణా రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతోంది. ఈ ఏడాది డిసెంబరు లో తెలంగాణాకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్, బి.ఆర్.ఎస్. పార్టీలు అధికారం కోసం హోరా హోరీ పోరాటం చేయనున్నాయి. సరదాగా రాజకీయాల్లోకి వచ్చి చట్టసభల్లో అడుగు పెట్టాలనుకున్న వారు ఈ రెండు పార్టీల్లో ఏది మంచిదో బేరీజు వేసుకుంటూ తమకి ఎక్కడ అయితే టికెట్ దక్కుతుందో లెక్కలు వేసుకుం టున్నారు. ఈ లోపు తమ పొలిటికల్ ఎంట్రీ గురించి లీకులు ఇస్తున్నారు. వారిలో అత్యంత కీలకమైన వారు దిల్ రాజు. టాలీవుడ్ లో పరిచయం అవసరం లేని సినీ నిర్మాత దిల్ రాజు స్టార్ ప్రొడ్యూసర్ గా పాపులర్ అయ్యారు. ఎన్నో ఘన విజయాలను అందించిన దిల్ రాజు తాజాగా ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లోనూ విజయం సాధించి సంబరాలు చేసుకుంటున్నారు.

     దిల్ సినిమాతో సినిమా కెరీర్ ప్రాంరభించిన రాజు ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నారు. టాలీవుడ్ లో ఆయన్ను అందరూ దిల్ రాజు అనే పిలుస్తారు. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీడియా సాక్షిగా దిల్ రాజు మాట్లాడుతూ ఇదేం ఉంది నేను ఎన్నికల బరిలో దిగానంటే ఎమ్మెల్యేగా అయినా.. ఎంపీగా అయినా కూడా గెలవగలను అని చాలా ధీమాగా అన్నారు. దీంతో షాక్ తినడం మీడియా వంతు అయ్యింది. చాలా కాలంగా దిల్ రాజు రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలు తెలంగాణాలో వినపడుతూనే ఉన్నాయి. అయితే వాటిపై ఆయన ఎప్పుడూ వివరణ ఇవ్వలేదు. వాటిని ఖండించనూ లేదు. ఆయనకు రాజకీయాల్లోకి రావాలని ఉందన్న ప్రచారం కూడా ఉధృతంగానే సాగుతోంది.అయితే ఏ పార్టీలో చేరతారు? ఏ నియోజక వర్గం నుండి పోటీ చేస్తారు? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వెల్లువెత్తాయి.దిల్ రాజు స్వస్థలం నిజామాబాద్ జిల్లా రూరల్. నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి కానీ లేదంటే నిజామాబాద్ లోక్ సభ నియోజక వర్గం నుంచి కానీ పోటీచేయాలని దిల్ రాజు భావిస్తోన్నట్లు చెబుతున్నారు. నిజామాబాద్ లోక్ సభ స్థానం నుండి బి.ఆర్.ఎస్. తరపున గత ఎన్నికల్లో కేసీయార్ తనయ కవిత పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా మధు యాష్కీ గౌడ్ పోటీ చేవారు. బిజెపి అభ్యర్ధి ధర్మపురి అరవింద్ ఎన్నికల్లో గెలిచి ఎంపీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు నియోజక వర్గం నుంచి అవకాశం వస్తే పోటీచేయాలని దిల్ రాజు అనుకుంటోన్నట్లు ప్రచారం జరుగుతోంది.

    ఇక నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి అయితే బి.ఆర్.ఎస్. తరపున ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ తరపున అరికెల నర్సారెడ్డి, భూపతి రెడ్డి తో పాటు నగేష్ రెడ్డి రేసులో ఉన్నారని అంటున్నారు. నగేష్ రెడ్డి అంటే సినీ నటుడు నితిన్ కు స్వయానా మేన మామ. నగేష్ రెడ్డి, నితిన్ లు దిల్ రాజుకు చాలా సన్నహితులు కూడా. ఒక వేళ ఇక్కడ దిల్ రాజుకు టికెట్ ఇస్తే నగేష్‌ రెడ్డి కుటుంబం కూడా దిల్ రాజుకు మద్దతుగా నిలిచే అవకాశాలున్నాయని అంటున్నారు. కాంగ్రెస్, బి.ఆర్.ఎస్. పార్టీ నాయకత్వాలు రెండూ కూడా దిల్ రాజు కు గేలం వేస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. స్టార్ ప్రొడ్యూసర్ కావడంతో టికెట్ ఇస్తే ఎన్నికల ప్రచారంలో సినీ గ్లామర్ కూడా తమకి కలిసొస్తుందని పార్టీలు భావిస్తున్నట్లు చెబుతున్నారు.ఇక ఆంధ్ర ప్రదేశ్ లో క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీ కోసం తహ తహ లాడుతున్నారు. ఆయన ఇప్పటికే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో రెండు మూడు సార్లు భేటీ అయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు తన సొంత జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.గుంటూరు లోక్ సభ నియోజక వర్గం నుంచి కానీ, లేదటే ఇదే జిల్లాలో ఏదైనా అసెంబ్లీ నియోజక వర్గం నుంచి కానీ అంబటి రాయుడు పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

     అంబటి రాయుడు జూనియర్ వాల్డ్ కప్ క్రికెట్ లో సత్తా చాటి జాతీయ జట్టులో స్థానం దక్కించు కున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రోత్సాహంతో ముంబయ్ ఇండియన్స్ కు ఐపీఎల్ లో ఆడిన రాయుడు ఆ తర్వాత ధోనీ ప్రోత్సాహంతో చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టుకీ ఆడాడు. ఈ ఏడాది తన ఐపీఎల్ కెరీర్ లో చివరి టోర్నీ ఆడిన అంబటి రాయుడు అన్ని ఫార్మేట్లకూ గుడ్ బై చెప్పాడు. దూకుడు స్వభావిగా పేరు గాంచిన అంబటి రాయుడు అద్భుతమైన మిడిల్ ఆర్డర్ ఆటగాడు. అలవోకగా సిక్సర్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంలో ఘటికుడు కూడా .2024 ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున అంబటి రాయుడు బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యాక.. ఏపీలో క్రికెట్ క్రీడను ప్రమోట్ చేయడంలో అంబటి రాయుడు కీలక పాత్ర పోషించబోతున్నారని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఐపీఎల్ లో ఏపీ తరపున ఒక ఫ్రాంఛైజీని తయారు చేయాలన్నదే తన ఆలోచన అని కూడా అన్నారు. అంచేత అంబటి రాయుడు కలిసింది నిజంగా క్రికెట్ ప్రమోషన్ కేనా? లేక రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా ఉందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉంది కాబట్టే ప్రజలతో మమేకం అవుతున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. క్రికెట్ కోసమే అయితే జనంతో మమేకం అవ్వాల్సిన అవసరం ఏముందని వారు నిలదీస్తున్నారు.

      ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని భేటీ కావడానికి కొద్ది రోజులు ముందు నుంచి కూడా అంబటి రాయుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను మెచ్చుకుంటూ వస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు లో ఏపీ అగ్రగామిగా ఉందని కితాబు నిచ్చారు అంబటి రాయుడు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు గుంటూరు జిల్లాలో కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయం టున్నారు. అయితే రాయుడే ఎన్నికల బరిలో దిగుతారా? లేక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల తరపున ఎన్నికల ప్రచారం చేసి ఎన్నికల తర్వాత వైఎస్ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైనా కీలకమైన నామి నేటెడ్ పోస్టు దక్కించుకుంటారా? అన్నది చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక తెలంగాణాలో సీనియర్ సినీ నటి జయసుధ మరోసారి రాజకీయ తెరపై మెరవాలని అనుకుంటు న్నారు. కొద్ది రోజుల క్రితమే బిజెపి నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి జయసుధతో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏమేమి అంశాలు చర్చకు వచ్చాయో తెలీదు. జయసుధ గతంలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. దివంగత వై.ఎస్.ఆర్. ప్రోత్సాహంతో కాంగ్రెస్ లో చేరిన జయసుధ సునాయస విజయం సాధించారు. ఆ తర్వాత చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు జయసుధ. తాజాగా కిషన్ రెడ్డితో సమావేశంతో జయసుధ పేరు మరోసారి రాజకీయ వర్గాల్లో వినపడింది. వచ్చే ఎన్నికల్లో ఆమెను సికింద్రాబాద్ నుంచి బరిలోకి దింపే అవకాశాలున్నాయని అంటు న్నారు. అయితే కిషన్ రెడ్డితో భేటీ గురించి జయసుధ ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. అటు కిషన్ రెడ్డి కూడా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.

     జయసుధ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే అది పొలిటికల్ ఎంట్రీ కాబోదు. చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ అవుతుంది. ఇక తెలంగాణా నుంచే మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కూడా బరిలో దిగబోతున్నారు. అజారుద్దీన్ కన్ను నిజామా బాద్ జిల్లా కామారెడ్డిపై ఉందని అంటున్నారు. ఈ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ పోటీచేయాలని అనుకుంటున్నారు. గత రెండు ఎన్నికల్లో షబ్బీర్ అలీ ఓడిపోయిన నేపథ్యంలో ఈ సారి తనకి ఇస్తే గెలిచి చూపిస్తానని అజారుద్దీన్ పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.క్రికెట్ చరిత్రలో ఆరంగేట్రంలోనే మొదటి మూడు టెస్టుల్లో మూడు సెంచరీలు సాధించి రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అయ్యారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల్లో చిక్కుకుని జట్టులో స్థానం కోల్పోయిన అజారుద్దీన్ 99 టెస్టుల వద్ద కెరీర్ ముగించాల్సి వచ్చింది. వందో టెస్టు ఆడాలన్న ఆశ నెరవేరలేదు. ఆ తర్వాత ఆయనపై నిషేధం ఎత్తివేసిన తర్వాత రాజకీయాల్లో అడుగు పెట్టారు అజారుద్దీన్. మొత్తానికి సినీ నటులు, స్టార్ క్రికెటర్లు వచ్చే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్