తెలంగాణలో బీఆర్ఎస్‌కి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయా..? గులాబీ పార్టీ నుండి సిట్టింగ్ ఎంపీలు జారిపోతున్నారా…? పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎంపీలు వెనకడుగు వేస్తున్నారా..? గులాబీ బాస్ కేసీఆర్ ఫార్మ్ హౌస్‌కే పరిమితం అయ్యారా…? బీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం నెలకొందా..? ఇంతకు కారు పార్టీలో ఏం జరుగుతోంది..?
తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్‌కి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ప్రతిపక్షంలోకి రాగానే బీఆర్ఎస్‌లో ఉన్న సిట్టింగ్ ఎంపీలు జారిపోతున్నారు. మరికొంత మంది సిట్టింగ్ ఎంపీలు, పార్టీ నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జంకుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది లోక్ సభ స్థానాలు గెలిచింది. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారుతున్నారు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత అధికార కాంగ్రెస్‌లో చేరారు. నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు సైతం బీఆర్ఎస్‌ని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా బీఆర్ఎస్‌ని వీడి బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
బీఆర్ఎస్ నుండి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎంపీలతో పాటు నేతలు వెనకడుగు వేస్తున్నారని గులాబీ నేతల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే మూడు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం నుండి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు పోటీ చేస్తారని తెలిపింది. చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో గడ్డం రంజిత్ రెడ్డి, కరీంనగర్‌లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తారని పార్టీ ప్రకటించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల పార్లమెంట్ స్థానాలపై బీఆర్ఎస్ తీవ్ర కసరత్తులు చేస్తోంది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో గువ్వల బాలరాజు, వరంగల్ స్థానానికి కడియం కావ్య, మహబూబాబాద్ నుండి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, పెద్దపల్లి నుండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, సికింద్రాబాద్ నుండి తలసాని సాయి కిరణ్ యాదవ్, మల్కాజ్‌గిరి నుండి మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికి టిక్కెట్లు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది.
ఇక నల్గొండ పార్లమెంట్ నుండి గుత్తా అమిత్ రెడ్డి, భువనగిరి ఎంపీ స్థానంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. అదే విధంగా మహబూబ్ నగర్ నుండి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి లేదా మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి నిలబడతారని ప్రచారం. నిజామాబాద్ నుండి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మెదక్ పార్లమెంట్ స్థానం నుండి వంటేరు ప్రతాప్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో పోటీలో ఉంటారని తెలుస్తోంది.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్‌లో నైరాశ్యం మొదలైంది. మరోవైపు అధినేత కేసీఆర్ ఫార్మ్ హౌస్‌కు పరిమితం అయ్యారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఒకవైపు నేతలను కాపాడుకోలేక, ఇంకోవైపు క్యాడర్‌లో ఉన్న కన్ఫ్యూజన్‌ను తొలగించడంలో గులాబీ బాస్ పూర్తిగా విఫలమవుతున్నారనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒకటి కంటే ఎక్కువ స్థానాలు గెలిచి చూపించాలని..ఇప్పటికే అధికార కాంగ్రెస్, బీజేపీలు సవాల్ విసిరాయి. దీంతో బీఆర్ఎస్‌కి ఈ పార్లమెంట్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొన్న కన్ఫ్యూజన్‌ను ఏ విధంగా పరిష్కరిస్తారు…? పార్లమెంట్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్‌లో ఉన్న సిట్టింగ్ ఎంపీలు ఎంత మంది పార్టీ మారతారనేది చూడాలి.


