ఆయన ఓ బడా రాజకీయ నేత వారసుడు. ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. అందుకోసం విశ్వప్ర యత్నం చేస్తున్నారు. కానీ, ఆయన పోటీ చేయాలనుకున్న పార్టీ అధినేత మాత్రం అందుకు ఛాన్సివ్వలేదు. అలాగని ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టలేదు. అతడి తండ్రికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దీంతో మొన్నటి వరకు సైలైంటుగా ఉండి పోయిన ఆయన.. ప్రస్తుతం ఎంపీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈసారైనా అవకాశం వస్తే లోక్‌సభ బరిలో దిగి విజ యం సాధిస్తానని నమ్మకంగా చెబుతున్నారు. ఇంతకీ ఆయన ఎవరు ? అతడి ఫ్యామిలీ రాజకీయ నేపథ్యం సంగతేంటి ?
ఇప్పుడు చెప్పుకున్నదంతా ఈయన గురించే. పేరు భాస్కర్ రెడ్డి. తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీని వాసరెడ్డి తనయుడు. పోచారం రాజకీయ వారసుడిగా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భాస్కర్ రెడ్డి.. డీసీసీబీ ఛైర్మన్‌గా ఉన్నారు. అయితే… ఎమ్మెల్యేగా ఎన్నికై మరింతగా ప్రజలకు సేవ చేయాలని భావించారు భాస్కర్ రెడ్డి. ఇందులో భాగంగా అసెంబ్లీకి పోటీ చేయాలని భావించారు. కానీ, గులాబీ బాస్ మాత్రం నో చెప్పారు. పోచారం శ్రీనివాసరెడ్డికే సీటు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో.. సైలెంట్‌గా ఉండిపోయారు భాస్కర్ రెడ్డి.
అసెంబ్లీ ఎన్నికల్లో తన లక్ష్యం నెరవేరకపోవడంతో భాస్కర్‌రెడ్డి చూపు లోక్‌సభ ఎన్నికలపై పడింది. దీంతో.. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇదే అంశంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అయితే… భాస్కర్ రెడ్డి చూపు జహీరా బాద్ ఎంపీ స్థానంపై పడిందని సమాచారం. ఇందుకు కారణం స్థానికంగా ఉన్న ప్రస్తుత ఎంపీ బీబీ పాటిల్‌పై నియోజకవర్గంలో అంతగా సదభిప్రాయం లేదన్న వాదనను విన్పిస్తున్నారు కొందరు. ఇదే తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు పోచారం తనయుడు.
కుమారుడికి ఎంపీ సీటు విషయంలో తెరవెనుక పోచారం శ్రీనివాసరెడ్డి సైతం పావులు కదుపుతున్నట్లుగా తెలు స్తోంది. గత ఎన్నికల్లోనే సీటు ఇప్పించే ప్రయత్నం చేసినా అప్పట్లో బీఆర్ఎస్ అధినేత ఒప్పుకోకపోవడంతో ఈసారైనా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. అయితే.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో… మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఒప్పించి ఎంపీ సీటు దక్కించుకునే దిశగా పోచారం సైతం పావులు కదుపుతున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ దిశగా పార్లమెంటు నియోజకవర్గ మీటింగ్‌ల్లో నేతలు, శ్రేణుల ద్వారా ఇదే విషయాన్ని హైకమాండ్ చెవిలో పడేలా పోచారం చేస్తున్నట్లుగా చెబుతున్నారు స్థానిక నేతలు. ఇటీవలె బాన్సువాడలో జరిగిన కార్యకర్తల సమావేశంలో భాస్కర్ రెడ్డి సైతం తన మనసులో మాట బైటపె ట్టారు. అధిష్టానం ఎంపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఓవైపు స్థానికంగా బీబీ పాటిల్‌పై నెలకొన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని భాస్కర్ రెడ్డి భావిస్తుంటే.. అధిష్టానానికి నచ్చచెప్పి సీటు సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. మరి.. ఈ విషయంలో గులాబీ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు…? జహీరాబాద్ సీటు ఎవరికి ఇస్తారు అన్నది ఆసక్తి రేపుతోంది.