విశాఖ జిల్లా మధురవాడలోని కొమ్మాదిలో ఇంటి సమీపంలోనే తహసీల్దార్ దారుణ హత్యకు గురయ్యాడు. విశాఖ రూరల్ తహసీల్దార్‌గా ఉన్న సనపల రమణయ్య ఎన్నికల నేపథ్యంలో ఇటీవల విజయనగరం జిల్లాలోని బంటుపల్లి కి బదిలీ అయ్యాడు. కొమ్మాదిలోని ఓ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులో నివాసం ఉండే ఆయన.. శుక్రవారం బాధ్యతలు చేపట్టి ఇంటికి చేరుకున్నాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఫోన్ రావడంతో కిందకు వచ్చి అపార్ట్‌మెంట్ గేట్ వద్ద ఓ వ్యక్తిని కలిసినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదైంది. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో దుండగుడు ఇనుపరాడ్‌తో తహసీల్దార్‌పై ఒక్కసారిగా దాడి చేసి పరారయ్యాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే రమణయ్య కుప్పకూలిపోయాడు. గమనించిన వాచ్‌మెన్ కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. దాడికి గల కారణాలపై ఆరా తీసున్నారు. మరోవైపు, తహసీల్దార్ హత్యతో రెవెన్యూ యంత్రాంగం ఉలిక్కిపడింది.