నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాచకొండ పరిధిలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి ఈ రోజు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ గారు రాచకొండ పరిధిలోని పబ్ లు, బార్లు, రెస్టారెంట్స్, ఫామ్ హౌస్ లు, వైన్ షాపులు, ఈవెంట్ ఆర్గనైజేషన్ నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ పరిధిలోని డీసీపీలు కూడా పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ బాధ్యతాయుతంగా సహకరించాలని కోరారు. ఈ వేడుకలలో ప్రజలు, యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారని, కాబట్టి శాంతి భద్రతల సమస్య రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ట్రాఫిక్, ఎస్ఓటి, షి టీమ్స్, పెట్రోలింగ్ వంటి పోలీసు బృందాలు వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు, నేరాలు జరగకుండా విధుల్లో ఉంటారని పేర్కొన్నారు.
ఔట్ డోర్ కార్యక్రమాలు జరిగే చోట డీజే బాక్సులకు అనుమతి లేదని, ఎటువంటి బాణసంచా కాల్చడానికి వీల్లేదని, పరిమితికి మించి ఈవెంట్ లోకి ప్రేక్షకులను అనుమతించకూడదని పేర్కొన్నారు. మహిళలపై ఎటువంటి వేధింపులు జరగకుండా నిరోధించడానికి తమ షి టీమ్ బృందాలు విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడానికి తమ బృందాలు తనిఖీలు చేస్తారని, నిషేధిత డ్రగ్స్ సరఫరా చేసే ముఠాల మీద ఉక్కుపాదం మోపుతున్నామని ఈ సంధర్బంగా కమిషనర్ పేర్కొన్నారు.
పబ్ లు, బార్లు, వైన్ షాపులు నిర్దేశిత సమయం లోపు మూసి వేయాలని, మైనర్ యువతకు మద్యం అమ్మే దుకాణాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వాహనాల పార్కింగ్ కు సరైన ఏర్పాట్లు చేయాలని, తమ షాపులు, పబ్ లు, రెస్టారెంట్ ల పరిసరాల్లో సీసీటీవీ లు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నగర శివార్లలో ఉండే ఫామ్ హౌస్ లలో ఏర్పాటు చేసే కార్యక్రమాలు కూడా నిబందనలకు లోబడి ఉండాలని, ఎటువంటి డ్రగ్స్ వినియోగం జరగకూడదని, మహిళలతో అసభ్యకర డాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించకూడదని పేర్కొన్నారు.
రోడ్ల మీద ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని, డ్రంకెన్ డ్రైవింగ్ పరీక్షలు కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే వాహన యజమానుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్థరాత్రి యువకులు నిర్లక్ష్యంగా అధిక వేగంతో వాహనాలు నడపకుండా మరియు ఎటువంటి బైక్ రేసులు చేయకుండా ఉండేందుకు నిర్దేశిత సమయం పాటు తాత్కాలికంగా ఫ్లై ఓవర్ లను మూసివేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ జానకి ఐపీఎస్, యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర ఐపీఎస్, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్ ఐపీఎస్, ఎస్ఓటి డీసీపీ గిరిధర్ ఐపీఎస్, డీసీపీ అడ్మిన్ ఇందిర, ఎల్బీ నగర్ డీసీపీ సాయి శ్రీ, ఎస్ఓటి డీసీపీ మురళీధర్, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.