స్వతంత్ర వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి 50రోజులకు పైగా రాజమహేంద్రవరం కారాగారంలో ఉన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆయనకు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ వచ్చారు. ఏపీలోని ఉండవల్లి నుంచి భాగ్యనగరానికి వచ్చిన బాబుకు.. అడుగడుగునా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు నీరాజనం పట్టారు. బుధవారం రోజున హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు ఇవాళ వైద్య పరీక్షల నిమిత్తం గచ్చిబౌలిలో ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. బుధవారం రోజున జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏఐజీ వైద్యుల బృందం చంద్రబాబును కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంది. వారి సూచన మేరకు ఇవాళ చంద్రబాబు ఏఐజీకి వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉందోనని.. ఏఐజీ వైద్యలు చంద్రబాబుకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటి రిపోర్ట్ వచ్చిన తర్వాత బాబు ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కంటి సమస్యతో బాధపడుతున్న చంద్రబాబు నాయుడు త్వరలోనే ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటి పరీక్షలు కూడా చేయించుకోనున్నట్లు సమాచారం.