స్వతంత్ర వెబ్ డెస్క్: పాక్‌కు మద్దతుగా టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ ట్వీట్ చేశారు. దీంతో టీమిండియా మాజీ స్పిన్నర్ భజ్జీపై ఫైర్ అవుతున్నారు ఇండియన్స్. వివరాల్లోకి వెళితే.. వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్తాన్ కు మరో ఓటమి ఎదురైంది. దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ పోరులో చిత్తై టోర్నీలో వరుసగా నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రపంచకప్ లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నిన్న జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో ఒక వికెట్ తేడాతో పాకిస్తాన్ ఓడిపోయింది. అయితే.. నిన్న జరిగిన మ్యాచ్లో అంపైర్స్ కాల్ నిబంధన కారణంగానే సౌత్ ఆఫ్రికా చేతిలో పాక్ ఓడిందంటూ టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ లో ఇద్దరు బ్యాట్స్మెన్ అదే తరహాలో అవుటయినప్పుడు, గత వరల్డ్ కప్ సెమీస్ లో కోహ్లీని ఇలాగే అవుట్ ఇచ్చినప్పుడు నోరు మెదపలేదు ఎందుకు అంటూ నెటిజన్లు భజ్జిపై మండిపడుతున్నారు. పాక్ అంటే ఎందుకంత ప్రేమ అంటూ ప్రశ్నిస్తున్నారు.