స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ బస్సు యాత్ర భూపాలపల్లి నుంచి పెద్దపల్లి జిల్లా వైపునకు కొనసాగుతోంది. ఈ క్రమంలో కాటారం వద్ద కార్నర్ మీటింగ్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దొరల తెలంగాణ – ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు రాజ్యాధికారం చేపట్టాలని ఆశించామని.. కానీ కేసీఆర్ ప్రజలకు దూరమవుతూ వస్తున్నారని తెలిపారు. తెలంగాణలో అధికారం ఒక కుటుంబానికే పరిమితమైందని.. దేశంలోనే అవినీతి ప్రభుత్వం తెలంగాణలోనే ఉందని రాహుల్ ఆరోపించారు. అవినీతి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.
“కేసీఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ విచారణ ఎందుకు జరపట్లేదు. బీజేపీపై కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే.. ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లో అభ్యర్థులను పోటీ పెట్టి బీజేపీకి సహకరిస్తోంది. బీజేపీ తెచ్చిన ప్రతి చట్టానికి బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. రైతు చట్టాలకు కూడా బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉంది.” అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే మహిళల ఖాతాల్లో ప్రతి నెలా రూ.2,500 వేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని.. రాష్ట్ర పరిధిలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అధికారం రాగానే రాష్ట్రంలో కులగణన చేపడతామని చెప్పారు. తెలంగాణలో పేదలు, రైతుల సర్కార్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. “పార్లమెంట్‌లో కులగణనపై నేను మాట్లాడాను. దేశంలో కేవలం ఐదు శాతం అధికారులు మాత్రమే బడ్జెట్‌ను నియంత్రిస్తున్నారు. అందరినీ పరిపాలనలో భాగస్వామ్యం చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. అదానీ రూ.లక్షల కోట్లు అప్పు తీసుకుంటారు. అదానీ తీసుకున్న అప్పులను బీజేపీ మాఫీ చేస్తుంది. స్వయం ఉపాధి రుణాలను మాత్రం మాఫీ చేయదు. ప్రజలు కొనే ప్రతి వస్తువుపై జీఎస్టీ వసూలు చేస్తుంది. ప్రజల నుంచి పన్నుల వసూలు చేసి అదానీకి కట్టబెడుతున్నారు. బీజేపీ ప్రభుత్వం రైతుల రుణాలు ఎందుకు మాఫీ చేయదు?” అని రాహుల్ ప్రశ్నించారు.