స్వతంత్ర వెబ్ డెస్క్: జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన భార్య నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి ఆందోళన వ్యక్తం చేయగా, తాజాగా కుమారుడు నారా లోకేశ్ కూడా ఆందోళన చెందుతూ ఎక్స్ ద్వారా ఆవేదన పంచుకున్నారు. చంద్రబాబు భద్రత నిస్సందేహంగా ప్రమాదంలో పడిందని, ఉద్దేశపూర్వకంగా ఆయనకు హాని తలపెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యానికి తక్షణ ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. జైలు గదిలో దోమలు, కలుషిత నీరు ఉన్నాయని, బరువు తగ్గడం, ఇన్ఫెక్షన్లు, అలెర్జీలతో ఆయన బాధపడుతున్నారని, సకాలంలో వైద్యసాయం అందడం లేదని పేర్కొన్నారు. చంద్రబాబుకు స్టెరాయిడ్లు ఎక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైద్యులు, అధికార యంత్రాంగం ఏం దాచేందుకు ప్రయత్నిస్తోందని లోకేశ్ ప్రశ్నించారు. చంద్రబాబుకు ఏమైనా జరిగితే అందుకు వైఎస్ జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.