స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్‌లో ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యూనివర్సిటీ’. ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ నారాయణ మూర్తి, కెమెరా మెన్ బాబూరావు దాస్, ఎడిటర్ మాలిక్, సింగర్, లిరిసిస్ట్ విజయ్ పాల్గొన్నారు.
ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో 6 పాటలు ఉన్నాయి. గద్దర్ గారు , జలదంకి సుధాకర్, వేల్పుల నారాయణ, మోటపలుకుల రమేష్, ములుగు విజయ్ గొప్పగా రాశారు. యూనివర్సిటీలలో పేపరు లీకేజీలు, గ్రూపు 1-2 లాంటి ఉద్యోగ ప్రశ్న పత్రాల్లోనూ పేపరులీకేజీలు… ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి ? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి ? లంబకోణాలు నేర్పిన వాళ్ళే కుంభకోణాలు చేస్తూ ఉంటే రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు విలవిల కోట్టుకుంటూ ఊపిరాడక నేల రాలుతుంటే కన్న తల్లితండ్రులు ఏమై పోవాలి. వాళ్లకు పాఠాలు బోధించిన గురువులు ఏమి కావాలి. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా నాగాసాకి హీరోషిమాల మీద వేసిన ఆటంబాంబులు కంటే హైడ్రోజెన్ బాంబులు కంటే టొర్నాడోటార్పిడోల కంటే సునామీల కంటే చాలా ప్రమాదకరమైనది కాపీయింగ్. చూసి రాసిన వాడు డాక్టర్ అయితే పేషేంట్ బతుకుతాడా? సచిన్ టెండూల్కర్ సెంచరీ చేస్తే అది కాదు.. మళ్ళీ సెంచరీ చెయ్యండి అంటే చేయగలరా?. చదువురాని వాడు ఇంజినీర్ అయితే బ్రిడ్జి నిలబడుతుందా? విద్యావ్యవస్థ చిన్నా భిన్నం అయితే మొత్తం వ్యవస్థే చిన్నాభిన్నం అవుతుంది.
సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ గారూ.. దయచేసి ఇవ్వండి సార్. సింగరేణి సంస్థను కూడా ప్రవేటీకరణ చెయ్యాలి అనుకుంటున్నారు. ప్రభుత్వరంగ సంస్థలు మొత్తం ప్రవేటీకరణ చేసుకొంటూ పోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి. విద్యార్థులు జాతి సంపద. వాళ్ళను రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది. ప్రభుత్వాల మీద ఉంది. మన అందరి మీద ఉంది అని చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’’’ అని అన్నారు.
నటీనటులు – ఆర్. నారాయణ మూర్తి, నూతన తారాగణం.
పాటలు – గద్దర్ – జలదంకి సుధాకర్, – వేల్పుల నారాయణ.-మోటపలుకులు రమేష్,- ములుగు విజయ్
ఎడిటింగ్ – మాలిక్
కెమెరా – బాబూరావు దాస్
కథ-స్క్రీన్ ప్లే – మాటలు – సంగీతం – దర్శకత్వం – నిర్మాత
ఆర్. నారాయణ మూర్తి