22.2 C
Hyderabad
Thursday, December 26, 2024
spot_img

లోకేశ్ ను అరెస్ట్ చేస్తే నారా బ్రాహ్మణి పార్టీని నడిపిస్తారు..అయ్యన్న సంచలన వ్యాఖ్యలు

స్వతంత్ర వెబ్ డెస్క్:  ‘చంద్రబాబునే కాదు… లోకేశ్‌నూ జైలుకు పంపిస్తాం!’ ఇది వైసీపీ నేతలు, ప్రభుత్వ పెద్దలు పదేపదే చేస్తున్న ప్రకటన ! అంతేకాదు… చంద్రబాబు, లోకేశ్‌ లను వరుస కేసుల్లో ఇరికించి, అక్రమంగా అరెస్టు చేసి, ఎన్నికల దాకా రిమాండులోనే ఉంచాలనే వ్యూహం రచిస్తున్నట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే టీడీపీ ఏం చేస్తుంది? అధినేత, ఆయన కుమారుడు ఇద్దరూ అరెస్టయితే ఎన్నికల సమయంలో ఏం చేయాలి? విశ్వసనీయ సమాచారం ప్రకారం… తెలుగుదేశం పార్టీ ‘ప్లాన్‌-బీ’ సిద్ధం చేసుకుంది. చంద్రబాబుతో పాటు లోకేశ్‌నూ అరెస్టు చేస్తే… ‘నారా’ వారి కోడలు, నందమూరి ఆడపడుచు బ్రాహ్మణి రంగంలోకి దిగి పార్టీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బహుశా వచ్చే వారంలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. స్కిల్‌ స్కామ్‌ పేరుతో చంద్రబాబును ఇప్పటికే అరెస్టు చేశారు. రిమాండ్‌ను అక్రమంగా ప్రకటించి, దానిని కొట్టివేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతుంది.

ఈ ప్రక్రియను వీలైనంత కాలం పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కోర్టు నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ, రకరకాల కేసులను తెరపైకి తెచ్చి వీలైనన్ని రోజులు ఆయనను జైలులో ఉంచాలన్నదే వైసీపీ పెద్దల వ్యూహం. సీఐడీ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కుంభకోణం పేరుతో ఆయనపై మరో వారెంటు సిద్ధం చేసింది. ఇదిలా ఉండగానే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కూడా అరెస్టు చేసేందుకు సీఐడీ రంగం సిద్ధం చేసింది. ‘ఫైబర్‌ గ్రిడ్‌ కుంభకోణం’ పేరుతో చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుత ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గౌతం రెడ్డి  ఫిర్యాదుతో ఈ కేసు మొదలైంది. ఇందులో ఇప్పటికే సీఐడీ నలుగురిని అరెస్టు చేసింది. వారందరికీ బెయిలు వచ్చింది. దీంతో… ఎప్పుడో ఈ కేసు ఆగిపోయింది. ఇప్పుడు దానిని తిరగదోడుతున్నట్లు సమాచారం.

ప్లాన్‌-బీతో టీడీపీ…
చంద్రబాబుతో పాటు లోకేశ్‌నూ అరెస్టు చేసి… దీర్ఘకాలం రిమాండులో ఉంచాలన్న వ్యూహాన్ని వైసీపీ అమలు చేస్తే దానిని దీటుగా ఎదుర్కొనేందుకు టీడీపీ ‘ప్లాన్‌-బీ’ సిద్ధం చేసుకుంది. నారా లోకేష్ అరెస్ట్ అయితే ఆయన సతీమణి నారా బ్రాహ్మణి నాయకత్వం వహిస్తారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు అన్నారు.

రాజమండ్రి రాగానే లోకేష్‌ను ప్రభుత్వం అరెస్టు చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. సవాళ్లు ఎదురైనా టీడీపీ కొనసాగుతుందని, సమర్థులైన నాయకులు ఎందరో ఉన్నారని పాత్రుడు ఉద్ఘాటించారు. ప్రస్తుత అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ అవినీతికి పాల్పడుతోందని, విధానపరమైన మార్పులతో ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపిందని విమర్శించారు. భవిష్యత్తులో కూడా టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.  వైఎస్‌ఆర్‌సీ శకం ముగిసిపోయిందని, రాబోయే ప్రభుత్వం టీడీపీయే ఏర్పాటు చేస్తుందని పాత్రుడు అన్నారు.
తనను మూడు రోజుల పాటు గృహనిర్బంధంలో ఉంచారని, పోలీసుల విచారణను ఎదుర్కొన్నారని పాత్రుడు పేర్కొన్నాడు. పోలీసులు తనపై 15 కేసులు పెట్టారని, మరిన్ని కేసులు, జైలు శిక్ష పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పార్టీ ప్రయోజనాల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని తెలిపారు. విశాఖపట్నంలో 75 వేల కోట్లకు పైగా విలువైన భూములను అధికార వైఎస్సార్‌సీపీ నేతలు లాక్కుని భూ యజమానులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటి దాకా చంద్రబాబు కుటుంబంలో మహిళలెవరూ రాజకీయాల గురించి మాట్లాడలేదు. భువనేశ్వరి, బ్రాహ్మణి హెరిటేజ్‌ కంపెనీ వ్యవహారాలు, ఎన్టీఆర్‌ ట్రస్టు కార్యక్రమాల గురించి మాత్రమే మీడియాతో మాట్లాడారు. భువనేశ్వరి మీద అప్పట్లో వికృతమైన ప్రచారం జరిగినప్పుడు కూడా సంయమనంతో ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడమే తప్ప అంతకుమించి ఎక్కువగా స్పందించలేదు. తాజాగా చంద్రబాబు అరెస్టు తర్వాతే భువనేశ్వరి మీడియా ముందుకు వచ్చారు. భువనేశ్వరి, బ్రాహ్మణి ఇద్దరూ నిరసన ర్యాలీల్లో కూడా పాల్గొంటున్నారు. శనివారం రాజమండ్రిలో బ్రాహ్మణి మాట్లాడిన తీరు చూసిన తర్వాత… ఆమె సామర్థ్యంపై పార్టీ శ్రేణులకూ నమ్మకం ఏర్పడిందని చెబుతున్నారు. వెరసి… చంద్రబాబు, లోకేశ్‌లిద్దరినీ ఒకే సమయంలో అరెస్టు చేసిన పక్షంలో బ్రాహ్మణి పార్టీ బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తద్వారా… అక్రమ అరెస్టుల వ్యవహారాన్ని మరింత బలంగా జనంలోకి తీసుకెళ్లి, ప్రభుత్వాన్ని ఎండగట్టాలన్నది తమ లక్ష్యమని చెబుతున్నారు.

Latest Articles

‘అనగనగా ఒక రాజు’ ప్రీ వెడ్డింగ్ వీడియో టీజర్ రిలీజ్

యువ సంచలనం నవీన్ పొలిశెట్టి మూడు వరుస ఘన విజయాలతో తెలుగునాట ఎంతో పేరు సంపాదించుకున్నారు. అనతికాలంలోనే అన్ని వర్గాల ప్రేక్షకుల మనసు గెలిచిన కథానాయకుడిగా నిలిచారు. ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్