స్వతంత్ర వెబ్ డెస్క్: ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మోడీకి ఆమె లేఖ రాశారు. స్పెషల్ సెషన్ సమావేశాల అజెండాలో 9 అంశాలను చేర్చాలని లేఖలో కోరారు.
అదానీ అక్రమాలు, మణిపూర్ అల్లర్లు, రైతు సమస్యలు, కనీస మద్దతు ధర విషయంలో ఇచ్చిన హామీ, కులాల వారీగా జనగణన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రోజురోజుకి దిగజారుతున్న సంబంధాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను ఆదుకోవడం, హర్యానా సహా దేశంలో పలు రాష్ట్రాల్లో చెలరేగుతున్న మత ఘర్షణలు, సరిహద్దుల్లో కొనసాగుతున్న చైనా ఆక్రమణలపై చర్చ జరపాలని లేఖలో పేర్కొన్నారు.
కాగా ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహణపై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి అజెండా ప్రకటించలేదు. దీంతో జమిలీ ఎన్నికలు, కొత్త చట్టాల రూపకల్పన, దేశం పేరు మార్చే తీర్మానం వంటి అంశాల కోసమే కేంద్రం ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


