స్వతంత్ర వెబ్ డెస్క్: నటుడు ప్రకాష్‌రాజ్(Prakash Raj) గత ఆదివారం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ (X) లో ఒక కార్టూన్‌ను పోస్ట్ చేశాడు. కార్టూన్‌లో అంగీ, లుంగీతో ఉన్న ఓ వ్యక్తి స్టెయిల్ లెస్ట్ స్టీల్ జెగ్గులోంచి చాయ్‌ను స్టైల్‌గా గ్లాసులో పోస్తున్నట్టుగా ఉంది. ఆ పోస్టుతోపాటు ‘బ్రేకింగ్ న్యూస్: చంద్రయాన్ పంపిన తొలి చిత్రం ఇదే’ అని కామెంట్ చేశాడు.
చంద్రయాన్-3(Chandrayan-3) ప్రయోగాన్ని కించపర్చేలా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన నటుడు ప్రకాశ్ రాజ్‌పై కేసు నమోదైంది. కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట్ జిల్లాలోని బనహట్టి పోలీస్‌స్టేషన్‌లో హిందూ సంస్థల నాయకులు ఆయనపై ఫిర్యాదు చేశారు. ఆయనపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో బనహట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆ పోస్టుపై సోషల్ మీడియాలో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూన్ మిషన్ దేశానికి గర్వ కారణమని, అలాంటి ప్రయోగాన్ని ప్రకాష్ రాజ్ ఎగతాళి చేయడం దారుణమని మండిపడుతున్నారు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ వివరణ ఇస్తూ చంద్రయాన్-3 ని ఎగతాళి చేయాలన్నది తన ఉద్దేశం కాదని, కేవలం జోక్ కోసమే ఆ పోస్ట్ పెట్టానని పేర్కొన్నాడు. అయినా, ఎదుటి మనిషి మీద జోకులు వేసినట్టు మాతృభూమి మీద జోకులు వేయడం కరెక్ట్ కాదని నెటిజన్ విమర్శలు చేస్తున్నారు.