స్వతంత్ర వెబ్ డెస్క్: మణిపూర్ (Manipur) అల్లర్ల వ్యవహారంలో ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై (No confidence Motion) ప్రధాని మోదీ లోక్‌సభలో ప్రశంగించారు. అవిశ్వాసం పెట్టిన ప్రతిపక్షాలకు ధన్యావాదాలు తెలిపారు. 2018లోనూ తనపై అవిశ్వాస తీర్మానం పెట్టారని గుర్తుచేశారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షాలపై ప్రజలు మాత్రం విశ్వాసం ఉంచలేదని ఎద్దేవా చేశారు. అవిశ్వాసం మాపై కాదు.. విపక్షాలపైనే అని వ్యాఖ్యానించారు. విపక్షాల అవిశ్వాసం తమకు శుభసూచకమన్నారు. 2024లోనూ ఎన్డీఏ కూటమి(NDA) బంపర్ మెజార్టీతో అధికారంలో కి రావడం ఖాయమని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు.
విపక్షాలు అవిశ్వాసం పెట్టి అభాసుపాలయ్యాయని పేర్కొన్నారు. క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే విపక్షాలు వరుస నో బాల్స్ వేస్తున్నాయన్నారు. నో కాన్ఫిడెన్స్ నో బాల్‌గా మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. విపక్షం నోబాల్స్ వేస్తుంటే.. అధికారపక్షం ఫోర్లు, సిక్సర్లు కొడుతోందని సెటైర్లు వేశారు. ప్రజలు ప్రతిపక్షాలకు ఐదేళ్లు సమయం ఇచ్చినా సిద్ధం కాలేకపోయాయన్నారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీలన్ని ఏకమయ్యాయని మండిపడ్డారు. 1999లో శరద్ పవార్ నేతృత్వంలో, 2003లో సోనియా గాంధీ(Sonia Gandhi) నేతృత్వంలో అవిశ్వాసం పెట్టారని.. కానీ నెగ్గలేదని మోదీ వెల్లడించారు.
తొమ్మిది సంవత్సరాల మా పాలనలో ఒక్క కుంభకోణం అయినా చూపించగలిగారా? అని ప్రధాని ప్రశ్నించారు. యువతరం కలలు నెరవేర్చే దిశగా పాలన కొనసాగిస్తున్నామన్నారు. 21వ శతాబ్ధం భారత్‌దే అని.. ఈ సమయం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రపంచ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం రోజురోజుకు పెరుగుతోందన్నారు. పెట్టుబడులకు ఇండియా స్వర్గధామంగా ఉందన్నారు. 37కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయపటపడినట్లు IMF అధికారికంగా చెప్పిందన్నారు.
ప్రధాని మోదీ స్పీచ్‌కు ముందే మణిపూర్‌కు చెందిన ‘ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్’ (ITLF) ప్రతినిధి బృందం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసింది. మణిపూర్ రాష్ట్రంలో కేంద్ర భద్రతా బలగాల మోహరింపును పటిష్టం చేయాలని.. సున్నితమైన ప్రాంతాలలో భద్రతను పెంచాలని అమిత్ షా(Amit Shah)కు మెమోరండం సమర్పించారు. హోంమంత్రి అభ్యర్థన మేరకు, జాతి హింసకు గురైన కుకీ-జో కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల మృతదేహాలను ఖననం చేయడానికి ఈ బృందం ప్రజలతో సంప్రదించి ప్రత్యామ్నాయ స్థలంపై నిర్ణయం తీసుకుంటుందని ITLF ఒక ప్రకటనలో తెలిపింది.