స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. జిల్లాలోని వీఆర్‌ఏల రెగ్యులరైజేషన్‌తో పాటు, వారిని వివిధ శాఖలకు కేటాయించిన ఆర్డర్స్ ను ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శివలింగయ్యతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…జిల్లాలో 314 మందికి ప్రభుత్వ ఉత్తర్వులు పంపిణీ చేస్తామన్నారు. భూస్వామ్య వ్యవస్థకు ప్రతిరూపంగా కొనసాగుతున్న వీఆర్‌ఏ (VRA) వ్యవస్థను రద్దుచేసి, వేలాది కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించడం ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో APPSC ద్వారా కేవలం నెలకు 3 వేల రూపాయలతో కన్ సాలిడేటెడ్ వేతనంతో నియమించబడిన వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ దేశ చరిత్రలో నిలిచిపోతుంది. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇలా గొప్ప నిర్ణయాలు తీసుకోలేదు. గ్రామంలో ఏ ఇతర శాఖ అధికారి వచ్చినా వీఆర్‌ఏలు అందుబాటులో ఉండేవారు. గత కొన్ని సంవత్సరాల నుంచి చాలీచాలని వేతనాలతో ఇబ్బదులు పడ్డారని గుర్తు చేశారు. మీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని సూచించారు. గృహలక్ష్మి మైనారిటీలకు లక్ష రుణ సాయం బీసీ నిరుపేదలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం, రుణ మాఫీ వంటి అనేక పథకాలను అమలు చేస్తుండటంతో ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అవుతున్నది. కేసీఆర్ తన అమ్ముల పొది లోంచి ఒక్కో ఆయుధాన్ని తీసి వదులుతుంటే ప్రతిపక్షాలకు షాక్ తగులుతుంది. వారి ఆశలు అడియాస కావడం ఖాయమన్నారు.