స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రజాయుద్దనౌక గద్దర్ పార్థీవ దేహం వద్ద పూలమాల వేసి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. సోమవారంనాడు సాయంత్రం గద్దర్ భౌతిక కాయాన్ని ఆయన ఇంటికి తీసుకువచ్చారు. గద్దర్ నివాసానికి చేరుకున్న కేసీఆర్ ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. సీఎం కేసీఆర్ వెంట హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ తదితరులున్నారు. గద్దర్ కునివాళి అర్పించిన తర్వాత కేసీఆర్ తిరిగి ప్రగతి భవన్ కు వెళ్లిపోయారు.
గద్దర్ ను కడసారి చూసేందుకు వేలాది మంది గద్దర్ అభిమానులు అల్వాల్ కు చేరుకున్నారు. అయితే అడుగడుగునా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని నిలువరించారు. ఇవాళ సాయంత్రం అల్వాల్ కు చేరుకున్న గద్దర్ పార్థీవ దేహన్ని కొద్దిసేపు అతని నివాసంలో ఉంచారు. గద్దర్ సతీమణి సహా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గద్దర్ నివాసంతో పాటు గద్దర్ ఏర్పాటు చేసిన మహాబోధి స్కూల్ వద్ద వేలాది మంది జనం ఉన్నారు.