స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లు రూపొందించింది. ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ విలీనం బిల్లు పాస్ చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు.
స్టేట్ గవర్నమెంట్ ఈ బిల్లును గవర్నర్ తమిళిసైకు పంపి 2 రోజులు గడిచినప్పటికీ.. ఆమె ఇంకా నిర్ణయం వెలువరించలేదు. సాంకేతికంగా మనీ బిల్లు కావడంతో గవర్నర్ కాన్సెంట్ కోసం రాష్ట్ర సర్కార్ పంపింది. అసెంబ్లీ సెషన్ ముగిసేలోగా గవర్నర్ కాన్సెంట్ చెప్పాలి. కానీ.. రెండు రోజులుగా గవర్నర్ స్పందించడం లేదు. గవర్నర్ తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సర్కారుపై వ్యతిరేక వైఖరితోనే ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆపుతున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల్లో అధిక శాతం బడుగు, బలహీన వర్గాలు, పేదలే ఉన్నారు. అలాంటి వారిని ఇబ్బంది పెట్టేలా గవర్నర్ వ్యవస్థ వ్యవహరించడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.
అసలే ఎన్నికల సమయం ఈ అంశాన్ని అన్ని పార్టీలు రాజకీయంగా వాడుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ముందు ముందు రోజుల్లో ఆర్టీసీ విలీనం హాట్ టాపిక్ గా మారనుంది. కాగా ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేస్తుంది. ఇప్పటికే ఇబ్బంది కలిగిస్తున్న గవర్నర్ వైఖరి.. RTC బిల్లు విషయంలో చేస్తున్న తాత్సారం… పేదలు, నిమ్న వర్గాలు అధికంగా వున్న TSRTC కార్మికుల కుటుంబాలకు మరిన్ని ఇబ్బందులు కలిగించే ప్రమాదం ఉందని పేర్కొంది.