స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. ప్రభుత్వం నిరుద్యోగులకు భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫ్లకార్డులు చేతపట్టుకుని నిరసన తెలియజేశారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన పోలీసులు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని సమీపంలోని పోలీసు స్టేషన్లకు తరలించారు. ఇక, దశలవారీగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అసెంబ్లీ వద్దకు తరలిరాగా.. వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలాఉంటే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. శాసనసభ ప్రారంభమైన వెంటనే కొన్ని నెలల క్రితం మరణించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులర్పించారు. శాసనసభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో శాసన సభ్యుడిగా, ఇతర అనేక హోదాల్లో పని చేశారన్నారు.
ఆయన వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉందన్నారు. సాయన్న కంటోన్మెంట్ ప్రజల కోసం చాలా తపనపడేవారని చెప్పారు. సాయన్న ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తాను ముఖ్యమంత్రిని అయ్యాక.. హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ను కలిపేందుకు అనేక ప్రయత్నాలు చేయడం జరిగిందన్నారు. అనేక సందర్భాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపామని గుర్తుచేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి కంటోన్మెంట్లను నగరపాలికల్లో కలపాలని ఆలోచిస్తుందన్న శుభవార్త అందిందని తెలిపారు. ఆ రకంగానైనా సాయన్న కోరిక నెరవేరాలని కోరుకుంటున్నానని అన్నారు. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు సభ్యులు కూడా ఈ సంతాప తీర్మానంపై మాట్లాడారు.


