స్వతంత్ర వెబ్ డెస్క్: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గోదావరి జిల్లాలో చేపట్టిన వారాహి యాత్ర విజయవంతం కావడంతో రెండో విడత వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. నేడు(జులై 9) ఏలూరు పట్టణంలో బహిరంగ సభతో రెండో విడత వారాహి యాత్ర ప్రారంభం కాబోతుంది. జగన్ ప్రభుత్వం ఆరోపించిన వైఫల్యాలను ఎత్తిచూపడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టారు. 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఏలూరులో బహిరంగ సభ, 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు జనవాణి, సాయంత్రం 6 గంటలకు ఏలూరు నియోజక వర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం నిర్వహించనున్నారు. అలాగే.. 11వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు దెందులూరు నియోజకవర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం, సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెం చేరుకుంటారు పవన్. 12వ తేదీన సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
కాగా, తొలి దశ వారాహి యాత్రలో పవన్ కల్యాణ్.. అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. సీఎం నుంచి మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఇలా ఎవరినీ వదలకుండా విమర్శలు గుప్పించారు పవన్ కల్యాణ్.. ఇక, పవన్ కామెంట్లకు అదే స్థాయిలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌంటర్లు పడ్డాయి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా పవన్ కామెంట్లపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. అయితే, ఎవ్వరు విమర్శించినా.. వారిపై మళ్లీ విమర్శలు గుప్పించారు జనసేనాని.. మరి రెండో దశ వారాహి విజయయాత్రలో ఎలాంటి.. అస్త్రాలు సంధిస్తారో.. వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, రేపు మరోసారి పార్టీ నేతలతో భేటీ కానున్నారు పవన్.. ఏలూరు సభ అనంతరం వారాహి యాత్ర రూట్ మ్యాప్ ఖరారుపై చర్చించనున్నారు.. దెందులూరు, తాడేపల్లి గూడెం, తణుకు, ఉంగుటూరు, ఉండి, నిడదవోలు వంటి నియోజకవర్గాల్లో పర్యటన ఉండే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి జనసేన శ్రేణులు.