స్వతంత్ర వెబ్ డెస్క్: చిన్న వయస్సులో వివాహాలు చేయవద్దని అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నప్పటికీ మైనర్‌లకు వివాహాలు చేస్తున్నారు. కొన్ని పెళ్లిళ్లు గుట్టు చప్పుడు కాకుండా జరిపేస్తుండగా, మరికొన్ని ఆర్భాటంగా చేసేస్తున్నారు. ఎవరైనా అధికారులకు సమాచారం ఇస్తే నిలిచిపోతున్న వివాహాలు ఎన్నో ఉన్నాయి. ఉన్నత చదువులు చదవి భవిష్యత్‌కు బంగారు బాట వేసుకోవాల్సిన వయస్సులో పుత్తడి బొమ్మలుగా మారి పుస్తెల తాళ్లు మెడలో వేసుకుంటున్నారు.
కొందరు తల్లిదండ్రులు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తే తమ బాధ్యత తీరిపోతుందని ఆలోచించడం, ఆర్థిక ఇబ్బందులు, అవగాహణ లోపం, మేనరికాలు, కొన్ని కులాల్లో ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉండడం వంటివి బాల్య వివాహాలకు కారణంగా ఉంటున్నాయి. కల్యాణలక్ష్మి పథకంలో విచారణ సందర్భాల్లో, సర్టిఫికెట్ల పరిశీలనలో బాల్య వివాహాలు వెలుగులోకి వచ్చాయి. ఎక్కువగా మారుమూల గ్రామాల్లో జరుగుతున్నాయి.
తాజాగా నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని ఓ తండాలో బాల్య వివాహం జరిగింది. తండాకు చెందిన బాలిక(13)కు, ఫకీరాబాద్‌కు చెందిన సాహెబ్‌రావు (42) అనే వ్యక్తితో వివాహం జరిపారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు, అధికారులు గ్రామానికి వెళ్లే సరికి సాహెబ్‌రావు బాలికను తీసుకుని వెళ్లిపోయాడు. ఈ క్రమంలో పెళ్లి అడ్డుకునేందుకు వచ్చిన అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు.
డీసీపీవో చైతన్య కుమార్ ఆధ్వర్యంలో తండాకు వెళ్లి విచారణ చేపట్టారు. బాల్య వివాహం చేసుకున్న వ్యక్తితో పాటు పెళ్లికి సహకరించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కార్యదర్శి హైమద్ నవీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్‌హెల్ప్‌లైన్ ప్రాజెక్టు సమన్వయకర్త జోత్స్న దేవి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ భాగ్యలక్ష్మి, అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు శోభ తదితరులు పాల్గొన్నారు.