తుపాన్లు వస్తున్నాయంటే చాలు…ప్రజలు, ప్రభుత్వాలు భయభ్రాంతులకు గురవుతున్నాయి. ఏపీలో మాండూస్ తీవ్ర తుపానుగా మారనుందని, శుక్రవారం తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ తెలిపింది. దీంతో అందరిలో హై అలర్ట్ మొదలైంది.
ప్రస్తుతం చెన్నైకి 440 కిమీ దూరంలో మాండూస్ కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడిన మాండూస్, శుక్రవారం ఉదయం నుంచి క్రమంగా బలహీనపడనుందని అంటున్నారు. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తున్న తుపాను శుక్రవారం అర్థరాత్రి పుదుచ్చేరి-శ్రీహరి కోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమయంలో 65 కిమీ నుంచి 85కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
తుపాను ప్రభావంతో నేడు, రేపు ఆంధ్రప్రదేశ్ లో దక్షిణకోస్తా, రాయలసీమ, పుదుచ్చేరి, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఏపీలో వాతావరణ కేంద్రం చెబుతున్న తుపాను ప్రభావిత ప్రాంతాలు ఇవే…
నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, ప్రకాశం,బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ ఇంకా, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, వైయస్సార్ జిల్లాలోనూ ఒకటి రెండుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మత్స్యకారులు ఈ నెల 10వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ సూచించారు. ఏపీలో తుపాను ప్రభావం చూపే ఆరు జిల్లాలు, 210 మండలాల్లో అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు.
మాండూస్ తుపాన్ నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను అలెర్టు చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల వద్ద టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేయాలని కూడా తెలిపారు. మొత్తానికి మాండూస్ తుపాను సృష్టిస్తున్న అలజడితో ఆంధ్రప్రదేశ్ వణుకుతోంది. ఎటువంటి నష్టం జరగకుండా నెమ్మదించాలని ప్రజలు కోరుకుంటున్నారు.