స్వతంత్ర వెబ్ డెస్క్: పోలీసులు చెప్పేవరకు తమ కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయినట్లు తెలియదని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చెప్పారు. ఈ వ్యవహారంపై విశాఖలో ఎంపీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల 12న తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి వచ్చి కుటుంబ సభ్యులను క్రూరంగా హింసించి డబ్బులు వసూలు చేశరని తెలిపారు. మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేశారని, ఈ ఘటనకు సంబంధించి హేమంత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారని వెల్లడించారు. ఏ2 రాజేశ్‌పై 40కి పైగా కేసులు ఉన్నట్లు తెలిసిందన్నారు. ఐదేళ్ల క్రితం నుంచి తన ఫోన్ రికార్డింగ్స్ చూడాలని.. తనకి హేమంత్ అనే అతను అసలు ఎవరో తెలియదని స్పష్టం చేశారు. విశాఖలో రక్షణ లేదని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారని, అది ఏమాత్రం సరికాదన్నారు. కిడ్నాప్ జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారని గుర్తు చేశారు. ఇలాంటి చిన్న చిన్న ఘటనలు జరగడం ఎక్కడైనా సహజమే అన్నారు.
తన కుటుంబాన్ని, ఆడిటర్ జీవిని 24గంటలకు పైగా నిర్బంధించి.. వారికి చావును పరిచయం చేసిన రౌడీషీటర్ హేమంత్ గురించి మాట్లాడకుండా, ఇతర కారణాలపై చర్చలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నాప్ వెనుక రాజకీయ కారణాలు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఏమీ లేవని స్పష్టతనిచ్చారు. నేరాలు అనేవి ఏ ప్రభుత్వంలోనైనా జరుగుతాయని.. అందరూ చెబుతున్నట్టుగా విశాఖలో నేరాలు, ఘోరాలు ఏమీ జరగడం లేదని అన్నారు. తనకు వైజాగ్ వదిలి వెళ్లిపోవాలనే ఆలోచనలు రావడానికి కారణం.. మీడియానేనని ఆరోపించారు. వందల అపార్ట్‌మెంట్లు కట్టినప్పుడు తనపై ఎలాంటి ఆరోపణలు లేవని.. కానీ ఎంపీ అయినప్పటి నుంచి తనని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.