స్వతంత్ర వెబ్ డెస్క్: బాచుపల్లిలోని నారాయణ కాలేజ్ హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వంశిత అనే విద్యార్థిని హాస్టల్ ఐదో అంతస్తు నుంచి దూకడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సీఐ సుమన్ కుమార్ తెలిపిన ప్రకారం.. కామారెడ్డి పట్టణనికి చెందిన ఆర్.వంశిత (16)ను వారం క్రితమే తల్లిదండ్రులు హస్టల్‌లో చేర్పించి వెళ్లారు. మంగళవారం ఉదయం ఆమె భవనంపై నుంచి కింద పడి రక్తపు మడుగులో ఉండడాన్ని గమనించిన సహ విద్యార్థులు కళాశాల నిర్వాహకులకు సమాచారం అందిచారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.