స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో మరోసారి గంజాయి తరలిస్తున్న ముఠాల గుట్టురట్టయింది. గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టిన మూడు జోన్ల పోలీసులు.. జాయింట్ ఆపరేషన్‌లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్, శంషాబాద్, మాదాపూర్, చందానగర్, రాజేంద్రనగర్ పోలీసులు పక్కా సమాచారంతో దాడులు చేశారు. మొత్తం మూడు కేసుల్లో 2.8 కోట్లు విలువ చేసే 910 కేజీల ఎండు గంజాయిని సీజ్ చేశారు. మూడు కేసుల్లో 8 మందిని అరెస్ట్ చేశారు. పరారీ ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల్లో ఒకరు గతంలో కూడా అరెస్ట్ అయినట్లు పోలీసులు చెప్పారు. ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నట్టుగా గుర్తించారు. ఒక కేసులో హరియాణా హిసార్ జిల్లాకు చెందిన జీవన్‌సింగ్ అనే ట్రక్కు డ్రైవర్.. జైపూర్‌కు చెందిన చంద్రశేఖర్, హైదరాబాద్‌కు చెందిన పర్వేజ్‌తో కలిసి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడు.
ఇక మరో కేసులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గోలూ అంకిత్‌సింగ్ షోలాపూర్‌కి డీసీఎంలో 758 కిలోల గంజాయిను తరలించాలరు. పోలీసులకు అనుమానం రాకుండా ఉండడానికి పైన తౌడుబస్తాలు వేశారు. ఈ క్రమంలోనే తనిఖీలు చేపట్టిన షాపూర్ నగర్ పోలీసులు అనుమానం వచ్చి కాస్త లోతుగా వెతికారు. దీంతో లోపల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 2.35 కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. జీవన్‌సింగ్, అంకిత్‌సింగ్‌లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఐదు మొబైల్స్, ఒక డీసీఎం వ్యాన్‌ను పోలీసులు సీజ్ చేశారు. జీడిమెట్ల, శంషాబాద్, చందానగర్‌ల్లో కేసులు నమోదు చేశామన్నారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర.