స్వతంత్ర వెబ్ డెస్క్: ఒడిశాలోని బాలేశ్వర్ సమీపంలోని బహనాగ్‌బజార్ వద్ద జరిగిన ఘోర రైళ్ల ప్రమాదంతో ఆంధ్రప్రదేశ్ వాసులు ఉలిక్కిపడ్డారు. ప్రమాదానికి గురైన రెండు రైళ్లలో పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఉన్నట్లు తెలుస్తున్నది. షాలిమార్ నుంచి చెన్నై వస్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వస్తున్న సూపర్ ఫాస్ట్ రైళ్లు శుక్రవారం సాయంత్రం బాలేశ్వర్ సమీపంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో తెలుగువారు ఎక్కువ మంది ఉన్నట్లు రైల్వే అధికారుల వద్ద ఉన్న జాబితాను బట్టి తెలుస్తున్నది.
రైలులో షాలిమార్, ఖరగ్‌పూర్, సంత్రగచ్చి, బాలేశ్వర్ స్టేషన్లలో ఎక్కిన ప్రయాణికుల్లో రాజమండ్రిలో 22 మంది, విజయవాడలో 47 మంది, ఏలూరులో ఒకరు మొత్తంగా 70 మంది దిగాల్సి ఉన్నది. ఇదే రైలులో రాజమండ్రి స్టేషన్ నుంచి 56 మంది, తాడేపల్లిగూడలో 10 మంది, ఏలూరులో 44 మంది, విజయవాడలో 120 మంది ప్రయాణికులు ఎక్కారు. వారంతా చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు టికెట్లు రిజర్వు చేసుకున్నారు.
ఇక కర్ణాటకలోని యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస స్టేషన్ల మీదుగా వెళ్లింది. అయితే తిరుపతి, రేణిగుంట, చీరాల స్టేషన్ల నుంచి ఖరగ్‌పూర్, హౌరా వైపు 52 మందికిపైగా ప్రయాణికులు వెళ్లినట్లు తెలుస్తున్నది.
ప్రమాదానికి గురైన రైళ్లలోని ప్రయాణికులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి రైల్వే అధికారులు హెల్స్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.
సికింద్రాబాద్ రైల్ నిలయం- 040 27788516
విజయవాడ రైల్వే స్టేషన్- 0866 2576924
రాజమండ్రి రైల్వే స్టేషన్- 0883 2420541
రేణిగుంట రైల్వే స్టేషన్- 9949198414
తిరుపతి రైల్వే స్టేషన్- 781595571
విజయనగరం హెల్ప్‌లైన్- 08922 221202, 221206
ఒడిశా ప్రభుత్వం ఏర్పాటుచేసిన నంబర్- 06782-26228
బెంగాల్ హెల్ప్‌లైన్ నంబర్లు- 033 2214 3526, 2253 5185