స్వతంత్ర వెబ్ డెస్క్: తన భార్యని అందాల్లో పోటీల్లో రన్నర్‌గా ప్రకటించినందుకు కోపంతో ఊగిపోయాడు ఓ భర్త. అంతేకాదు అదే కోపంతో స్టేజి పైకి వెళ్లిన అతను కిరీటాన్ని నేలకేసి కొట్టాడు. తన భార్యకి అన్యాయం జరిగిందని వాపోయాడు సాటి భర్త. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌లో మిస్ గే మాటో గ్రాసో 2023 అందాల పోటీలు ఘనంగా జరిగాయి. పలువురు మహిళలు ఈ పోటీల్లో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. చివరకు నథాలీ బెకర్, ఇమ్మాన్యుయెల్ బెలీని ఫైనల్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఉత్కంఠకు తెరదించుతూ విజేతను ప్రకటించారు. వీరిద్దరిలో బెలీని అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. ఈ క్రమంలో ఆమెకు కిరీటాన్ని పెట్టేలోపే.. ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తన భార్య రెండో స్థానంలో నిలవడాన్ని తట్టుకోలేక అక్కడే ఉన్న నథాలీ బేకర్ భర్త ఆగ్రహంతో ఊగిపోయాడు. ఒక్కసారిగా స్టేజ్‌పైకి దూసుకొచ్చి నానా హంగామా చేశాడు. తన భార్యకు అన్యాయం జరిగిందంటూ విజేతకు పెట్టబోయిన కిరీటాన్ని లాక్కుని రెండు సార్లు నేలకేసి కొట్టాడు. అక్కడున్నవారిపై అరుస్తూ.. తన భార్యను పక్కకు లాక్కెళ్లాడు.
అతని చర్యకు వీక్షకులు, నిర్వాహకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకుని అతన్ని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. అనంతరం విజేతకు కిరీటాన్ని అలంకరించారు. ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటనపై అందాల పోటీల నిర్వాహకులు స్పందించారు. భార్యకు అన్యాయం జరిగిందని భావించి అతను అలా ప్రవర్తించాడని వివరణ ఇచ్చారు. అయితే న్యాయ నిర్ణేతలు సరైన నిర్ణయమే తీసుకున్నారని ఓ ప్రకటనలో తెలిపారు.