స్వతంత్ర వెబ్ డెస్క్: సినిమా.. రెండు గంటలు పాటు చూసి నవ్వుకొని ఎంజాయ్ చేసే కాలక్షేపం. కానీ, కొన్ని సినిమాలు విడుదలకి ముందే చర్చనీయాంశంగా మారిపోతాయి. ఆ సినిమాలు స్టోరీల దెబ్బకి కొన్ని ప్రభుత్వాలు భయపడిపోతున్నాయి. దీన్నే అదునుగా చేసుకుంటున్న ప్రతిపక్షాలు అధికార పక్షం మీద విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. ఇప్పటికే విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న ‘ది కేరళ స్టోరీ’ సినిమా దేశవ్యాప్తంగా ఎలాంటి కాక పుట్టించిందో తెలిసిన విషయమే. చివరికి కొన్ని రాష్ట్రాలు ఈ సినిమాని విడుదలను సైతం బహిష్కరించాయి కూడా. ఎన్నో వివాదాల తరువాత.. ఎలాగూ కొన్ని రాష్ట్రాల్లో రిలీజ్ అయింది. సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన.. పాజిటివ్ అభిప్రాయాలు రావడంతో మిగతా రాష్ట్రాలు కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నాయి. ఇక సినిమా కమర్షియల్‌గా ఎంత పెద్ద సక్సస్ సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. వందల కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. అలాగని కేరళ స్టోరీ వివాదం ఇంకా ముగియలేదు.
ఈ నేపథ్యంలో ఆ వేడి చల్లారకముందే.. తాజాగా పశ్చిమ బెంగాల్ వేదికైంది. సనోజ్ మిశ్రా దర్శకత్వంలో `ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్` తెరకెక్కుతోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్‌పై వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దర్శకుడిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. దీంతో దర్శకుడిపై చర్యలకు దిగింది. సినిమా ద్వారా రాష్ట్ర పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు నోటీసులు ఇచ్చారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. ఇదంతా ఆ సినిమా ట్రైలర్ రిలీజ్‌కే ఇంత జరిగింది. రిలీజ్ అయిన తర్వాత తృణమూల్ ప్రభుత్వం ఇంకే స్థాయిలో రియాక్ట్ అవుతుందో ఊహించొచ్చని ఎద్దేవా చేసాయి ప్రతిపక్షాలు.