స్వతంత్ర వెబ్ డెస్క్: రాజమహేంద్రవరంలో 2రోజులు జరిగే మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుంది తెలుగుదేశం పార్టీ. 42సంవత్సరాల టీడీపీ ప్రస్థానం, యుగ పురుషుడు నందమూరి తారక్ రామారావు శతజయంతి వేడుకలను పురస్కరించుకొని కనివిని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు తమ్ముళ్ళందరి బాట ఇప్పుడు మహానాడు వైపే. ఈ కార్యాక్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల శంఖారావం కూడా పూరించనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకి, అతిధులకు నోరూరించే గోదావరి వంటకాలను రూచి చూపించింది. మొదటి రోజు అయినా నేడు దాదాపు 3,500 మంది సిబ్బందితో 6 లక్షల మందికి.. 200 వంటకాల్ని అతిథులకి వడ్డించారు.
టిఫిన్ కింద ఇడ్లీ, వడ, మైసూర్ భజ్జీతో పాటు పునుగులు, పొంగల్, టమాటా బాత్, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబార్ వడ్డించారు. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనంలో వెజ్ బిర్యానీ, బంగాళదుంప కుర్మా, మామిడికాయ పప్పు, గోంగూర, గుత్తు వంకాయ, సాంబారు, పెరుగు అలానే మజ్జిగ పులుసుని వడ్డించారు. అదనంగా కాకినాడ కాజా, యాపిల్ హల్వా, తాపేశ్వరం గొట్టం కాజాతో అతిధుల నోరు తీపిచేయనున్నారు.
ఇక ఆదివారం(మే 28న) పది లక్షల మందికి పైగా వస్తారనే అంచనా వేస్తున్నారు. టిఫిన్ మెనూ అదే ఉండగా.. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో మార్పులు చేశారు. మెనూలో.. సాంబారు రైస్, చక్కెర పొంగలి, పెరుగన్నం పెడతారు. భోజనాల దగ్గర ఏకంగా 10 లక్షల నీటి సీసాలు, 10 లక్షల మంచినీటి ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు.