స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: గతేడాదే ఐపీఎల్‌లో అడుగుపెట్టి అద్భుతంగా రాణిస్తున్న గుజరాత్ టైటాన్స్ జట్టు వరుసగా రెండో సారి కూడా ఐపీఎల్ ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది. అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన క్వాలిఫయిర్2 మ్యాచులో గిల్ స్వైరవిహారంతో పాటు మోహిత్ బౌలింగ్‌లో అదరగొట్టడంతో 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో చెన్నైతో తుది సమరానికి రెడీ అయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన హార్దిక్ సేన నిర్ణీత 20ఓవర్లలో 233 పరుగుల స్కోర్ చేసింది. సూపర్ ఫాంలో ఉన్న శుభమన్ గిల్ మరోసారి శతకంతో అదరగొట్టాడు. 60బంతుల్లోనే 129 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. సాయి సుదర్శన్(43), కెప్టెన్ పాండ్యా(28) కూడా రాణించారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనతో బరిలో దిగిన ముంబై జట్టుకు పేలవ ఆరంభం దక్కింది. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. అయితే మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్(61), తెలుగు యువతేజం తిలక్ వర్మ(43), కామెరూన్ గ్రీన్(30) పరుగులతో రాణించినా ఫలితం లేకుండా పోయింది. సీనియర్ మోహిత్ శర్మ 5వికెట్లతో రాణించడంతో రోహిత్ సేన 18.2 ఓవర్లలో 171 పరుగులకే కుప్పకూలింది.
కాగా అద్భుత విజయంతో ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్ ఆదివారం టైటిల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తో అమీతుమీకి సిద్ధమైంది. క్వాలిఫయర్-1లో చెన్నై చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుని మరోసారి కప్పును ముద్దాడుతుందో లేదో చూడాలి.
ఐపీఎల్‌లో గిల్ రికార్డులు..
ఓ ఐపీఎల్ సీజన్‌లో 3 లేదా అంతకంటే ఎక్కువ శతకాలు చేసిన బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ 3వ స్థానంలో ఉన్నాడు. 2016లో కోహ్లి, 2022లో బట్లర్ 4 సెంచరీలు చేసి మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.
ఇక ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ గిల్(851) పరుగులతో 3వ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. 2016లో కోహ్లి 973 పరుగులు, 2022లో బట్లర్ 863 పరుగులు చేశారు.