స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏపీలోని బాపట్ల జిల్లా స్టువర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టరులో రవితేజ లుక్ చూస్తుంటే సినిమా ఏ రేంజ్ లో ఉండనుందో అర్థమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు.
‘అది 70 వ దశకం.. బంగాళాఖాతం తీరప్రాంతంలోని ఒక చిన్న ప్రాంతం. ప్రపంచాన్ని భయపెట్టే చీకటి కూడా అక్కడి జనాలను చూసి భయపడుతుంది.. దడదడ మంటూ వెళ్లే రైలు.. ఆ ఊరు పొలిమేర రాగానే గజగజ వణుకుతుంది. ఆ గ్రామం మైలురాయి కనపడితే.. జనం అడుగులు తడబడతాయి. దక్షిణ భారతదేశపు నేల రాజధాని.. ది క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఇండియా.. స్టూవర్టుపురం. ఆ ప్రాంతానికి ఇంకో పేరు కూడా ఉంది. టైగర్ జోన్. ది జోన్ ఆఫ్ టైగర్ నాగేశ్వరరావు’ అంటూ హీరో వెంకటేశ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ అదిరిపోయింది.
ఇక ‘జింకలను వేటాడిన పులిని చూసి ఉంటావ్. పులులను వేటాడే పులిని ఎప్పుడైనా చూశావా..? అంటూ రవితేజ చెప్పే డైలాగ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.