స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులు క్షమాపణ చెప్పాలని అమరావతి మహిళా రైతులు డిమాండ్ చేశారు. ఆర్-5 జోన్‌కు వ్యతిరేకంగా దీక్షా శిబిరాల్లో శాంతియుతంగా నిరసన చేస్తున్న తమను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. తమ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని కోసం భూములు ఇవ్వడమే తాము చేసిన తప్పా? అని ప్రశ్నించారు. మహిళలనీ చూడకుండా పక్కకు లాగి పడేస్తారా? అని నిలదీశారు.
తమను డీఎస్పీ అసభ్య పదజాలంతో దూషించారని మహిళలు ఆరోపించారు. మిమ్మల్ని భూములు ఎవరు ఇవ్వమన్నారని హీనంగా మట్లాడరని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అంతకుముందు ఆర్-5 జోన్‌కు వ్యతిరేకంగా జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ తుళ్లూరులో నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ఈ దీక్షకు మద్దతు ఇచ్చిన మహిళలను పోలీసులు పక్కకు తోసేసి అదుపులోకి తీసుకున్నారు.