స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై మరోసారి సీఎం జగన్ విమర్శలతో విరుచుకుపడ్డారు. నెల్లూరు జిల్లా కావలిలో చుక్కల భూములపై నిషేధం ఎత్తివేస్తూ రైతులకు హక్కు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తూ వీరిద్దరూ రైతు బాంధవుల వేషాలు వేసుకుని నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వీళ్ల పర్యటనలకు భయపడి తాము రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నామంటూ ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. వీళ్లు వచ్చినా రాకున్నా ఈ నాలుగేళ్లు ధాన్యం ఎవరు కొన్నారని ప్రశ్నించారు.
2014 ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తామన్న చంద్రబాబు ఏం చేశారని.. ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ అప్పుడు నోరెందుకు మెదపలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్యాకేజీ తీసుకున్న ప్యాకేజీ స్టార్ చంద్రబాబు వైపున నిలబడ్డారని ఎద్దేవా చేశారు. తన పాలనలో మీకు న్యాయం జరిగిందని నమ్మితే అండగా నిలవండని విజ్ఞప్తి చేశారు. అండగా నిలబడకపోతే పేదలు ఏపీలో బతికే పరిస్థితి ఉండదని ప్రజలను జగన్ హెచ్చరించారు.