స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ వీర జవాన్ పబ్బాల అనిల్(30) భౌతికకాయానికి స్వగ్రామమైన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్కాపుర్ లో అంత్యక్రియలు ముగిశాయి. జై జవాన్ .. అనిల్ అమర్ రహే అంటూ వీరజవాన్ కు తుది వీడ్కోలు పలికారు. అమర జవాన్ అంత్యక్రియలకు కిలోమీటర్ల మేర ప్రజలు తరలిరావడంతో అంతిమయాత్ర జనసంద్రమైంది. ఆర్మీ లాంఛనాలతో ఘనంగా అనిల్ అంత్యక్రియలు నిర్వహించారు. ‘జై జవాన్’, ‘అనిల్ అమర్ రహే’ నినాదాలతో మల్కాపూర్ మార్మోగిపోయింది.
కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, శ్రేయోభిలాషులు పబ్బాల అనిల్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. ఇంటికి చేరుకున్న అనిల్ మృతదేహంపై పడి భార్య, తల్లిదండ్రులు, కుటుంసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. బావా లెవ్వే.. ఎప్పుడొస్తావు.. నిన్ను చూడబుద్ది అవుతోంది అంటూ అమర జవాన్ అనిల్ భార్య కన్నీరు పెట్టిన తీరు ప్రతిఒక్కరిని శోక సంద్రంలో మునిగిపోయేలా చేసింది. కొడుకా అనిలూ.. లేవు బిడ్డా.. అంటూ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా విలపించడం ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది.
అమరజవాన్ అనిల్ భౌతికఖాయానికి మంత్రి గంగుల కమలాకర్, బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎమ్మెల్యే రవిశంకర్, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ నివాళులు అర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని అనిల్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. కాగా, జమ్మూకశ్మీర్ అర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో జవాన్ పబ్బాల అనిల్ మృతి చెందిన సంగతి తెలిసిందే.


