స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలో మరో సాగునీటి ప్రాజెక్టు అయిన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై సోమవారం మధ్యాహ్నం కొత్త సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్షలో కరివేన, ఉద్దండాపూర్ నుంచి వెళ్లే కాల్వల గురించి చర్చించనున్నారు. అలాగే నారాయణ్‌పూర్, కొడంగల్, వికారాబాద్ వెళ్లే కాల్వల గురించి కూడా చర్చించనున్నారు. ఈ సమీక్షలో సంభందిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. కాగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పేపర్లపై ఆదివారం సీఎం సంతకం చేశారు.
నూతన సచివాలయం ప్రారంభం అనంతరం తమ స్థానంలో ఆశీనులైన సీఎం కేసీఆర్.. మొత్తం 6 ఫైళ్లపై సంతకం చేశారు. మొదటగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తూ మొదటి ఫైల్ పై సీఎం సంతకం చేశారు. దీంతో మొత్తం 40 విభాగాల్లో 5,544 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందుకు గాను సీఎం కేసీఆర్ కు మంత్రి హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు. తరువాత దళిత బంధు పథకం అమలు ఫైల్‌పై సీఎం సంతకం చేశారు. దీంతో 118 నియోజకవర్గాల్లో 1100 మందికి చొప్పున దళిత బంధు వర్తించనుంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా గర్భిణీలకు పౌష్టికాహారం అందించే న్యూట్రిషన్ కిట్ ఫైల్ పై సీఎం కేసీఆర్ సంతకం చేసి తగిన ఆదేశాలు జారీ చేశారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6.84 లక్షల మంది గర్భిణీలకు.. 13.08 లక్షల కిట్స్ పంపిణీ చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఒక్కో న్యూట్రిషన్ కిట్ విలువ రూ. 2000 ఉంటుంది. ఈ పథకానికి మొత్తం రూ. 277 కోట్లు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. దీంతో హర్షం వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు.. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.


