స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: మరికొన్ని రోజుల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలోనే కొన్ని సంస్థలు ఓపినీయన్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. ఈసారి ఏబీపీ న్యూస్-సీఓటర్ తన సర్వే వివరాలను వెల్లడించింది. సర్వేలో మొత్తం 17,772 మంది ప్రజల అభిప్రాయాలను సేకరించినట్లు తెలిపింది.
ఈ సర్వే ప్రకారం 224 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గరిష్టంగా 107- 119 సీట్లు గెలుచుకోనుంది. ఇక బీజేపీకి 74-86 సీట్లు వచ్చే అవకాశం ఉంది. జేడీఎస్ 23-35 సీట్లు సాధించుకోనుంది. ఇతరులు 5 సీట్లు వరకూ గెలుచుకుంటారు. కాంగ్రెస్ 40శాతం ఓట్ షేర్ సాధించుకోగా.. బీజేపీ 35శాతం ఓట్ షేర్ దక్కించుకుంది. జేడీఎస్ ఓట్ షేర్ 17శాతంగా ఉంది. ఇక ఇతరులకు 8శాతం ఓట్లు పడతాయని సర్వేలో వెల్లడైంది.
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ పనితీరు బాగుందని 29శాతం మంది అభిప్రాయపడగా, బాగలేదని 52శాతం మంది తెలిపారు. 19 శాతం ఫరవాలేదని చెప్పారు. సీఎం బసవరాజు బొమ్మై పని తీరు బాగుందని 24 శాతం మంది అభిప్రాయపడగా, 51 శాతం బాగలేదని, 25శాతం మంది ఫరవాలేదని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇక కర్ణాటక సీఎంగా ఎవరైతే బాగుంటారనే అంశంపై ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి 31శాతం మొగ్గుచూపగా, మాజీ సీఎంలు సిద్ధరామయ్యకు 41శాతం, హెచ్‌డీ కుమారస్వామికి 22శాతం, డి.శివకుమార్‌కు 3శాతం మంది మొగ్గుచూపారు.